ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం ఈ నెల 24 టీమిండియాను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అదే రోజు టెస్టు జట్టు సారథిని కూడా ప్రకటించనున్నారు. ఈ మేరకు బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు.
అంతకు కొన్ని రోజుల ముందే స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలా స్వల్ప వ్యవధిలో ముగ్గురు సీనియర్లు తప్పుకోవడంతో టీమిండియా బలహీనంగా మారింది. ఇలాంటి స్థితిలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడం కూడా సెలెక్టర్లకు సవాల్‌గా తయారైంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పేరు కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉంది. అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బిసిసిఐ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. జస్‌ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్‌లు రేసులో ఉన్నా గిల్‌కే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. శనివారం జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశంలో కొత్త కెప్టెన్‌తో పాటు జట్టును ఎంపిక చేయనున్నట్టు సమాచారం.