Thursday, May 22, 2025

నియంతలను తలదన్నిన నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

నియంతల ఏలుబడిలో పౌరహక్కులకు తావు ఉండదు. మంచీ, మానవత్వానికి చోటు దొరకదు. నిరంకుశత్వానికే అక్కడ అగ్రతాంబూలం. కానీ, నేటి ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంతలను తలదన్నే దేశాలున్నాయంటే నమ్మశక్యం కాదు. అలాంటి దేశాల జాబితాలో అగ్రస్థానం ఇజ్రాయెల్ దేనంటే ఆశ్చర్యపోనక్కరలేదు. పేరుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న ఈ దేశంలో అధికార పీఠంపై కూర్చున్నది అక్షరాలా ఓ నియంత. ఆ పెద్దమనిషి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఆయన నేతృత్వంలో గాజాపై గత 18 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో 52 వేల మందికి పైగా అసువులు బాశారు. లక్షలాదిమంది క్షతగాత్రులయ్యారు. అయినా ఆయన యుద్ధకాంక్ష మాత్రం తీరలేదు సరికదా, రానురాను మరింత పెచ్చరిల్లుతోంది. గాజాపై ‘పరిపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోనని ఇటీవల ఆయన చేసిన శపథమే ఇందుకు ఉదాహరణ. ‘గాజాను మొత్తం స్వాధీనం చేసుకుంటాం.

అక్కడ నెలకొన్న కరవు పరిస్థితులను నివారించవలసి ఉంది’ అంటూ ఆయన తాజాగా చేసిన ప్రకటన గిచ్చి జోలపాడటమనే సామెతను గుర్తు చేయక మానదు. గాజాను ఇంతటి దుర్భర స్థితిలోకి నెట్టిన నెతన్యాహు ఇప్పుడు దానిని బాగు చేస్తామనడాన్ని చూసి ముక్కున వేలేసుకోనివారు ఉండరు. గాజాలో ప్రస్తుత పరిస్థితిని వర్ణించడానికి మాటలు చాలవు. ఎక్కడ చూసినా శిథిల భవనాలు, బక్కచిక్కిన మనుషులు. ఆకలి బాధను తట్టుకోలేక కళ్లముందే బిడ్డలు చనిపోతుంటే ఏడవడానికి కూడా ఓపికలేని మాతృమూర్తులను చూస్తే ఎవరికైనా గుండె చెరువుకాక మానదు. గాజాకు తక్షణ మానవతాసాయం అందకపోతే, రానున్న 48 గంటల్లో 14వేల మంది చిన్నారులు క్షుద్బాధతో చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిందంటే, అక్కడి పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ నెతన్యాహు మనసు మాత్రం కరగడం లేదు. గత కొన్ని నెలలుగా మానవతాసాయంపై ఉక్కుపాదం మోపిన ఆ పెద్దమనిషి, ఐక్యరాజ్య సమితి హెచ్చరికతోనూ దిగిరాకపోగా, పరిమితి సాయానికి మాత్రమే అనుమతినిస్తామనడం కరడుగట్టిన రాక్షసత్వానికి నిదర్శనం. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన నెతన్యాహు ఆ లక్ష్యానికి ఎగనామం పెట్టి, ఆస్పత్రులు, శరణార్థి శిబిరాలపైనా యథేచ్ఛగా బాంబుల వర్షం కురిపిస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన యాభైరెండు వేలమందిలో హమాస్ ఉగ్రవాదులు ఎంతమందో ఆయన చెప్పగలరా? జనవరి నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మళ్లీ యుద్ధానికి సిద్ధపడిన నెతన్యాహు ప్రధాన లక్ష్యం గాజా ఆక్రమణే. గాజాను స్వాధీనం చేసుకుని, కరవు పరిస్థితులను నివారిస్తామని నెతన్యాహు చెబుతుండగా, అక్కడి ప్రజలను వేరే చోటికి తరలించి, గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు.

మొత్తానికి ఇద్దరికీ ఒకటే లక్ష్యం.. గాజాను హస్తగతం చేసుకోవడం. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టీ పట్టగానే ఆధునిక శాంతిదూత అవతారమెత్తిన ట్రంప్, రష్యా- ఉక్రెయిన్; హమాస్- ఇజ్రాయెల్ యుద్ధాలపై గుడ్లురిమారు. తక్షణమే యుద్ధవిరమణ జరగకపోతే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కానీ, వాస్తవంలో తాను ఆశించింది జరగకపోగా, ఇజ్రాయెల్‌ను కనీసం చర్చల వేదికపైకి కూడా రప్పించలేకపోతున్నారు. అంతెందుకు, గాజాపై ఇజ్రాయెల్ అమానుష కాండను తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా ముక్తకంఠంతో ఖండించగా అమెరికా వాటితో గొంతు కలపకపోవడం దేనికి సంకేతం? ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య చర్చలను సైతం నిలిపివేసి, బ్రిటన్ తన నిబద్ధతను చాటుకోవడం ప్రశంసనీయం.

హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలే లక్ష్యంగా 2023 అక్టోబర్ 1న యుద్ధం ప్రారంభించిన నెతన్యాహు ఇప్పుడు తన లక్ష్యాన్ని తానే తుంగలో తొక్కి గాజా ఆక్రమణ దిశగా అడుగులు వేయడానికి స్వప్రయోజనాలతోపాటు రాజకీయ ప్రయోజనాలు కూడా కారణం. యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగిస్తే అంతకాలం తాను పదవిలో కొనసాగవచ్చునన్నది ఆయన ఆలోచనగా కనబడుతోంది. ఇప్పటికే నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలపై వివిధ కోర్టులలో విచారణ జరుగుతోంది. మరోవైపు నిరంతర యుద్ధం పట్ల ఇజ్రాయెల్ లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పటికైనా మేలుకోవాలి. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాల బాటలో ఇజ్రాయెల్‌పై వత్తిడి తెచ్చేందుకు చేయీచేయీ కలిపి ముందుకు రావాలి. గాజాకు మానవతా సాయం అందించడమే తక్షణ కర్తవ్యంగా నెతన్యాహు మెడలు వంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News