వైసిపి మాజీ రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని దుయ్యబట్టారు. ఈ మేరకు జగన్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమికి మేలు చేయడానికి విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సీటు అమ్మేసుకున్నారని జగన్ ఆరోపించారు. అలాగే, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
“రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరింది. యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రూ.11 వేల కోట్ల స్కాం ఇది. మా హాయంలో మేము సెకితో కుదుర్చుకున్న ఒప్పందం 2.49 రూపాయలు. ఇప్పుడు 2.11 రూపాయల అదనంగా పెట్టి ఒప్పందం చేసుకున్నారు. ఇలా 25 ఏళ్ళలో 11 వేల కోట్లు ప్రజాధనాన్ని ఆ కంపెనీ వాళ్లకు ఇస్తున్నారు. నాలుగు గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి 24 గంటలకు అదే రేటుతో కొనుగోలు చేస్తున్నారు. అన్నీ విషయాలు ఆధారాలతోనే చెప్తున్నాం. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టిన చరిత్ర దేశంలోనే ఎక్కడా ఉండదు. అప్పుల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అధికారాన్ని ఇవ్వకూడదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఏపీఎండీసీని అంధకారం చేస్తున్నారు. శాశ్వతంగా అప్పులు ఊబిలో కూరుకు పోయేలా చేస్తున్నారు. మన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు” అని జగన్ ఆరోపించారు.