మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు. ‘మైడియర్ డాడీ’ అంటూ గురువారం కవిత ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణలు చేశారు. ఇటీవల నిర్వహించిన బిఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా ఆమె లేఖలో ప్రస్తావించారు.
బిజెపితో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ కవిత.. కెసిఆర్ కు వివరంగా లేఖ రాశారు. “బిజెపిపై రెండు నిమిషాలే మాట్లాడడంతో అనుమానాలకు తావిచ్చారు. బిజెపి వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పార్టీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. వక్ఫ్ బిల్లుపై కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. బిసిలకు 42 శాతం కోటా అంశం విస్మరించారు. ఎస్సి వర్గీకరణపై నోరు విప్పలేదు. పాత ఇన్‌ఛార్జ్‌లకే లోకల్ బాడీ బీ ఫారం ఇస్తారా?. 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదికపై మాట్లాడనివ్వరా?” అంటూ కవిత లేఖలో ప్రశ్నించారు.
కాగా, కొన్ని రోజులుగా కెసిఆర్ కుటుంబంలో చీలికలు వచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కెటిఆర్ కు పార్టీ భాద్యతలు అప్పగించాలని..అలాగే, భవిష్యత్ లో సిఎంను చేయాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే హరీశ్ రావును పక్కకు పెడుతున్నారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇక, పార్టీలో తనను నెంబర్ 2గా చేయాలని.. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని కవిత కెసిఆర్ కు కండిషన్ పెట్టిందని.. లేకపోతే కొత్త పార్టీ పెట్టడం లేదా వేరే పార్టీలో చేరే ఆలోచన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ కు కవిత లేఖ రాయడం సంచలనంగా మారింది.