Saturday, May 24, 2025

గ్లోబల్‌ట్యాక్స్‌తో గ్రీన్‌గ్యాస్ ఉద్గారాలు తగ్గేనా?

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ వార్మింగ్ కట్టడికోసం గ్రీన్‌హౌస్ ఉద్గారాల (హరిత వాయువువల వెల్లువ)పై గ్లోబల్ ట్యాక్స్ విధించడానికి షిప్పింగ్ వనరుగా ఉన్న ప్రధాన దేశాలు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం నౌకలు విడుదల చేసే ప్రతి టన్ను కార్బన్ డైయాక్సైడ్‌పై ఇకనుంచి కనీసం 100 డాలర్ల వంతున పన్ను విధించనున్నాయి. ఆయా దేశాల నౌకలు లక్షాలను చేరలేకపోయినా, ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ నెట్ జీరో ఫండ్‌కు నిధులు అందించకున్నా 2028 నుంచి ఈ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 11న లండన్‌లో 60కి పైగా దేశాల ప్రతినిధులతో ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ (ఐఎంఒ) సమావేశం జరిగింది. అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం దీనికి గైర్హాజరు కావడం గమనార్హం. ఓడల్లో వాడే ఇంధనానికి సైతం ఈ సమావేశం పలు ప్రమాణాలను నిర్దేశించింది. మొత్తం ఉద్గారాల్లో షిప్పింగ్ వాటా 3 శాతమని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

ఓడల సంఖ్యతోపాటు వాటి పరిమాణం పెరుగుతుండడం, అందుకు అనుగుణంగా ఇంధనవాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో రానున్న రోజుల్లో షిప్పింగ్ ఉద్గారాలు ఇంకా ఎక్కువవుతాయని భావిస్తున్నారు. ఐఎంఒ భేటీలో కుదిరిన ఒప్పందంపై సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగెజ్ హర్షం వెలిబుచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి షిప్పింగ్ ఆధునికీకరణకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ బృందం అర్థవంతమైన ఏకాభిప్రాయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్యానికి సముద్ర నౌకా రవాణా అన్నది వెన్నుముక వంటిది. ఏటా సుమారు 12 బిలియన్ టన్నుల సరకు నౌకలపై రవాణా అవుతుందని యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యుఎన్‌సిటిఎడి) 2023 నివేదిక వెల్లడిస్తోంది. 2022లో సముద్ర వాణిజ్యం 0.4 శాతం తగ్గినా, కంటైనర్ల ద్వారా రవాణా (2024 నుంచి కంటైనర్ల రవాణా ఏటా 3% పెరుగుతోంది) చమురు, గ్యాస్ రవాణా 2022 నుంచి క్రమంగా 6%, 4.6 శాతం పెరుగుతుండడంతో 2028 నాటికి మొత్తం సముద్ర వాణిజ్యం 2.1% నుంచి 2.2% వరకు పెరుగుతుందని అంచనా.

ఈ విధమైన పెరుగుదల ఇంధన వాడకానికి మరింత ఆజ్యం పోస్తుంది. గత దశాబ్దకాలంగా షిప్పింగ్ ఉద్గారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏటా విడుదలయ్యే ఒక బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ ఉద్గారాలు, 3% గ్లోబల్ గ్రీన్‌హౌస్ గ్యాస్‌తో సమానం. భారీ నౌకలు ప్రతి ట్రిప్పుకు ఎక్కువ సరకును రవాణా చేస్తుంటాయి. భారీ మొత్తంలో ఇంధనాన్ని మండిస్తుంటాయి. పనామా, లిబేరియా, మార్షల్ దీవుల్లో ఇదే పరిస్థితి. ప్రపంచం మొత్తం మీద రవాణా అయ్యే టన్నుల సరకుల్లో మూడోవంతు ఈ రేవుల ద్వారానే జరుగుతుంది. అంతే సమానంగా ఉద్గారాలు విడుదల అవుతుంటాయి. ఇంటర్నేషనల్ మారటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఒ) 2023 సవరించిన గ్రీన్‌హౌస్ గ్యాస్ (జిహెచ్‌జి)వ్యూహం (స్ట్రాటెజీ) ఆశించే లక్షాలను నిర్దేశించింది. 2008 నాటి ఉద్గారాలస్థాయిలను ప్రామాణికంగా తీసుకుని 2030 నాటికి 20% నుంచి 30% వరకు ఉద్గారాలు తగ్గించాలని, 2050 నాటికి జీరో స్థాయికి చేరుకోవాలని నిర్దేశించింది.

అయిననప్పటికీ, ఎలాంటి చొరవ తీసుకోకుంటే ఉద్గారాలు మరింత ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేశారు. యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ గుర్తించడం బట్టి భౌగోళిక రాజకీయ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు, మళ్లీ చమురు, ఆహార ధాన్యాల నౌకల రవాణా టన్నుల భారం కన్నా మరింత దూరం సాగేలా చేస్తున్నాయి. 2023లో చమురు రవాణా దూరంతోపాటు సుదీర్ఘకాలం సాగింది. ఐఎంఒ మెరైన్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ నిర్ణయించిన గ్లోబల్ కార్బన్ టాక్స్ మేరకు ఆయా లక్షాల నౌకలు నెట్ జీరో నిధులను అందించడం కానీ, లేదా ఉద్గారాల నియంత్రణ కానీ చేయలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఇది వాడుతున్న ఇంధన ప్రమాణాల బట్టి ఆధారపడి ఉంది. ఉద్గారాలను పూర్తిగా, లేదా కొంత స్థాయివరకు తగ్గించడానికి దోహదపడే హైడ్రోజన్, మెథనాల్, అమెనియా వంటి వాటిని ప్రోత్సహించడం అవసరం. ప్రకృతికి విరుద్ధమైన మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కిపోతూనే ఉంది. 1850లో భూ ఉష్ణోగ్రతను నమోదు చేయడం మొదలైనప్పటి నుంచి అత్యుష్ణ సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించగా, వెంటనే 2024 ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్లూఎంఒ) గత జనవరిలో ఈమేరకు ఓ నివేదిక విడుదల చేసింది.

అసలు గడచిన పదేళ్లు భూమిపై గత 125000 ఏళ్లలోనే అత్యుష్ణ సంవత్సరాలని ఐరోపా, బ్రిటన్, జపాన్ దేశాల వాతావరణ సంస్థలు నిర్ధారించాయి. బొగ్గు, చమురు ఆధారిత పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి భూ ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల 1.5 సెల్సియస్ డిగ్రీలకు (2.7 ఫారన్ హీట్) మించకుండా చూడాలని 2015లో పారిస్ వాతావరణ సభ తీర్మానించింది. కానీ ఈ ఏడాది భూ ఉష్ణోగ్రత ఆ పరిమితిని మించి 1.6 సెల్సియస్ డిగ్రీలకు పెరిగిందని ఐరోపా కమిషన్‌కు చెందిన కొపెర్నికస్ వాతావరణ విభాగం తెలిపింది. జపాన్ ఈ పెరుగుదలను 1.57 డిగ్రీలుగా, బ్రిటన్ 1.53 డిగ్రీలుగా లెక్కగట్టాయి. వాతావరణ మార్పుల వల్ల వరదలు, తుపానులు, అనావృష్టి తలెత్తి గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 14,000 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్లనే వాతావరణంలో కర్బనం పెరిగి ఉష్ణోగ్రతను పెంచుతోంది. పారిశ్రామిక విప్లవంనుంచి సంపన్న ఐరోపా, అమెరికా ఖండ దేశాలు శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ప్రపంచానికి 170 లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగించాయి.

ఈ నష్టాలను అధిగమించడానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల డాలర్ల సహాయం చేయాల్సిన సంపన్న దేశాలు కేవలం 30,000 కోట్ల డాలర్లను అదీ 2035 కల్లా విదిలిస్తామని ప్రతిపాదించాయి. భూగోళం వేడెక్కడ మనేది కఠోరమైన వాస్తవమని డబ్లుఎంఒ తాజా నివేదిక మరోసారి రుజువు చేస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. భూతాపం పెరగడం మాతాశిశు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. వేడి ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య పెరుగుతున్నందున నెలలు నిండక ముందే శిశు జననాలు సంభవిస్తున్నాయి. తల్లులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 202024 మధ్య కాలంలో 247 దేశాలు, 940 నగరాల్లో అధిక వేడిరోజులు రెట్టింపు అయ్యాయని తేల్చారు. గడిచిన అయిదేళ్లలో భారత్‌లో గర్భిణులకు ప్రమాదకరమైన రీతిలో జాతీయ స్థాయిలో ఏటా సగటున ఆరు అదనపు అత్యుష్ణ రోజులు నమోదైనట్టు నివేదికలు చెబుతున్నాయి.

కె. యాదగిరి రెడ్డి
98667 89511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News