కరీంనగర్: ఎంఎల్ సి కవిత నేరుగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు లు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగే విధంగా కవిత లేఖ ఉందన్నారు. కవిత (MLC Kavitha letter ) అడిగిన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలోని కొంత మంది బిజెపితో ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటున్నారని అడిగారు.
కరీంనగర్ ఫిలిం సొసైటీ లో సామాజిక ఉద్యమకారుడు, గొప్ప మానవతావాది, లోక్ సత్తా ఉద్యమ నాయకుడు నరేడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న బిజెపితో బిఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉన్నారని కాంగ్రెస్ అడిగితే రాజకీయమన్నారని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి అవసరం లేని పార్టీ బిఆర్ఎస్ అని, సొంత కూతురే కార్యకర్తల బాధలని లేవనెత్తి అధ్యక్షుడికి లేఖ రాసిందని, కనీసం కార్యకర్తలను కలవలేని పరిస్థితి ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేశారు.
కెసిఆర్ చెబితేనే కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, ఇప్పుడు కవిత కూడా అదే అంశాన్ని ప్రస్తావించారని, దీనికి బిఆర్ఎస్ నుండి ముఖ్య నాయకులు లేదా కెసిఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ చిట్ చాట్ పెట్టి కవిత లేఖ (MLC Kavitha letter ) బాంబును డైల్యూట్ చేసేందుకు కాంగ్రెస్ ని విమర్శించారని, కెటిఆర్ ముందు కవిత లేఖలో ప్రస్తావించిన అంశంపై స్పందించాలని, బిజెపిపై బిఆర్ఎస్ ఎందుకు విమర్శలు చేయడంలేదని ప్రశ్నించారు. 2001 నుండి పార్టీలో ఉన్నవారిని ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడంలేదని పొన్నం ప్రభాకర్ అడిగారు.