మెదక్, కామారెడ్డి జిల్లాలో ఎసిబి వలలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా, పెద్దశంకరంపేట ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విఠల్‌రెడ్డి డ్రైనేజీ పనుల విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం సాయంత్రం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా ఎసిబి డిఎస్‌పి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023-=24 సంవత్సరంలో మేజర్ గ్రామ పంచాయతీ పెద్దశంకరంపేటలో చేపట్టిన డ్రైనేజీ పనులకు సంబంధించిన పనులు ఉండగా రూ.లక్షా 95 వేలు పనులు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన చెక్ అప్పుడు ఎంపిడిఒగా విధులు నిర్వహించిన విఠల్ రెడ్డి ఎంబి చెక్ ఇవ్వడానికి సంబంధిత కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 20 వేలు డిమాండ్ చేశాడు.
ప్రస్తుతం విఠల్ రెడ్డి పెద్దశంకరంపేట ఇన్‌ఛార్జి ఎంపిడిఒగా విధులు నిర్వహిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఎసిబి అధికారులకు ఈ నెల 20వ తేదీన ఫిర్యాదు చేయగా శుక్రవారం సాయంత్రం ఎంపిడిఒ కార్యాలయంలో రూ.15 వేల లంచం సొమ్మును తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేలు స్వాధీనపర్చుకున్నారు. ఈ దాడుల్లో జిల్లా ఎసిబి ఇన్స్‌స్సెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు ఉన్నారు.
అదేవిధంగా కామారెడ్డి జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, కానిస్టేబుల్ సంజయ్ శుక్రవారం ఎసిబికి చిక్కారు. 2018లో ఒక కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. తాజాగా పది వేల రూపాయలు బాధితులు ఇచ్చే క్రమంలో అధికారులు కాపు కాసి పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి రాజశేఖర్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరస్తామని తెలిపారు. వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎసిబి ఎఎస్‌పి చైతన్య రెడ్డి, పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.