ప్రజలు అనుకుంటున్న విషయాలే లేఖ ద్వారా చెప్పా బిఆర్ఎస్లో చిన్నచిన్న
లోపాలపై చర్చించుకోవాలి కెసిఆర్‌కు వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ
లేదు కూతురునైన నా లేఖే బయటకు పొక్కడం బాధాకరం కాంగ్రెస్, బిజెపిలకు
కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు సంబురపడుతున్నాయి కెసిఆర్ నాయకత్వంలోనే
తెలంగాణ బాగుపడుతుంది ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
కెసిఆర్‌కు లేఖ తానే రాసినట్లు స్పష్టీకరణ అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవితకు
స్వాగతం పలికేందుకు రాని బిఆర్ఎస్ శ్రేణులు టీమ్ కవితక్క..సామాజిక
తెలంగాణే లక్షం పేరిట అభిమానులు, జాగృతి కార్యకర్తల బ్యానర్ల ప్రదర్శన
మనతెలంగాణ/హైదరాబాద్: “కెసిఆర్‌కు లేఖ రాసింది నేనే…తెలంగాణలో ప్రజలు అనుకుంటున్న విషయాలే అందులో చెప్పాను.. నాకు పర్సనల్ అజెండా ఏమీ లేదు.. ఆ లేఖను బహిర్గతం ఎవరు చేశారు. దాని వెనకాల ఎవరున్నారో అర్థం చేసుకోవాలి. పార్టీలోని కొందరు కోవర్టులే ఆ లేఖను లీక్ చేశారు. పార్టీని పటిష్టం చేయాలనేది నా ఉద్దేశం. కెసిఆర్ దేవుడు. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయి” అంటూ బిఆర్ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ అధినేత, తన తండ్రి కెసిఆర్‌కు ఎంఎల్‌సి కవిత రాయడంపై ఆమె స్పష్టత ఇచ్చారు. రెండు వా రాల క్రితం తానే లేఖ రాశానని వెల్లడించారు. అమెరికా పర్యటన ముగించుకొని శు క్రవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎంఎల్‌సి కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ‘
కవిత బయటకు రాగానే ‘సీఎం సీఎం’ అంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత శం షాబాబ్ ఎయిర్‌పోర్టు బయట మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ చుట్టూ కొన్ని ద య్యాలు ఉన్నాయని, వాటి వల్లనే పార్టీకి చాలా నష్టం జరుగుతోందని అన్నారు. కోవర్టులను తప్పిస్తేనే పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా కెసిఆర్‌కు అనేక సార్లు తన అభిప్రాయాలు చెప్పినట్లు తెలిపారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే తాను లేఖ ద్వారా చెప్పానని అన్నారు.
ఎప్పుడు అవసరమైనా తాను ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నానని, కానీ ఈసారి ఆ లేఖ బహిర్గతం కావడమే బాధాకరమని అన్నారు. కెసిఆర్ కూతురుని అయిన తాను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి..? అన్న అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుందని చెప్పారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్, బిజెపి పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని, ఆ రెండు పార్టీలు తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని మండిపడ్డారు. తాను కెసిఆర్‌కు లేఖ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు. తమ నాయకుడు కెసిఆరే అని,ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం అయినా, బిఆర్ఎస్ పార్టీ అయినా బాగుపడాలంటే అది కెసిఆర్ వల్లనే సాధ్యం అని పేర్కొన్నారు.
కానరాని బిఆర్ఎస్ జెండాలు
అమెరికా వెళ్లిన బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవిత సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమె ఎయిర్‌పోర్టు నుంచి వెంటనే బయటకు రాకుండా సుమారు 40 నిమిషాల పాటు విఐపి లాంజ్‌లో కూర్చుని ఫోన్ ద్వారా మంతనాలు సాగించినట్లు తెలిసింది. అయితే ఎంఎల్‌సి కవిత ఎవరితో ఫోన్లో మాట్లాడారో అన్నది తెలియలేదు. అంతకుముందు అమెరికా నుంచి దుబాయికి చేరుకుని కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.అయితే ఎంఎల్‌సి కవితకు స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ నేతలెవరు కానీ,పార్టీ శ్రేణులు కానీ ఎవరూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లలేదు. విమానాశ్రయం తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కిక్కిరిపోయింది.
“సామాజిక తెలంగాణ లక్షంగా గౌరవ ఎంఎల్‌సి కవితకు స్వాగతం సుస్వాగతం” అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. టీం కవిత పేరుతో అక్కడ ఆమె అభిమానులు హడావుడి చేశారు. ఇదిలా ఉండగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని గులాబీ రంగు జెండాలు కాకుండా నీలి రంగు బ్యానర్లపై పసుపు పచ్చ రంగులో అక్షరాలు రాయడం వెనుక ఉన్న మర్మం ఏమిటీ అనేది ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో బిఆర్ఎస్ జెండాలు కానీ, పార్టీ అధినేత కెసిఆర్, పార్టీ అగ్రనేతలు కెటిఆర్, హరీష్‌రావు పేర్లు, ఫొటోలు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అయితే కవిత స్వాగతించేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వారిలో అన్నీ కొత్త ముఖాలే కనిపించడం పట్ల పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.