మన తెలంగాణ / హైదరాబాద్ : ఇరు తెలుగు రాష్ట్రాలలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కలిసిపనిచేయడానికి నిర్ణయించామని ఏపి, తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సివిల్ సప్లై భవన్‌లో ఏపి, తెలంగాణ మంత్రులు, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ రాష్ట్ర విభజన చట్టం ఆమోదింపజేశారని కొనియాడారు. ఇద్దరం చిన్ననాటి స్నేహితులమని, ఇకపై రాష్ట్ర విభజన చట్టంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉమ్మడిగా పరిష్కరించుకునేందుకు ఇరు ప్రభుత్వాలు నిర్ణయించినట్లు మంత్రులు తెలిపా రు.
ఆహారభద్రతకు లోపం లేకుండా పిడిఎస్ పంపిణీ లో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని రాబోయే రో జుల్లో పౌరసరఫరాల వ్యవస్థలో వినూత్న మార్పులకు ఇది తొలి అడుగు అని ఏపి మంత్రి నాదెండ్ల మనోహ ర్ తెలిపారు. హైదరాబాద్‌లో తమ ఆదీనంలో ఉన్న భవనం, క్వార్టర్స్‌ను తెలంగాణ పౌరసరఫరాల శాఖ కు అప్పగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పౌరసరఫరాల పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని, మీ అనుభవాలను మాకు పంచాలని మంత్రి నాదెండ్ల కోరారు. ఆంధ్రాలో ఉన్న కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం వంటి పోర్టులలో తెలంగాణ ధాన్యం ఉత్పత్తుల ఎగుమతులకు సహకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సమస్య ప్రతిచోటా ఉందని, రైతుల కు అన్నివిధాలుగా ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా శాఖ పరంగా కొత్త టెక్నిక్స్‌ను పంచుకుంటామన్నారు. ఇరు రాష్ట్రాల్లో ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని, ఇరు రాష్ట్రాలకు మేలు జరిగే అంశాలు పరస్పరం సహకరించుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
విభజన చట్టంలోని 10వ షెడ్యూలులోని కార్పొరేషన్ ఆస్తుల విభజనపై ఏపి, తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు అవగాహన ఒప్పందం (ఎంవోయు)చేసుకున్నారు. అందులో క్రాంతి శిఖర అపార్ట్‌మెంట్ లోని 16 ఫ్లాట్లు, సివిల్ సప్లై భవన్‌లో ఉన్న 22,595 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎ-బ్లాక్ ను తెలంగాణకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నట్లుగా ఎంవోయు లో పొందుపరుచారు. ఇది ఒక చక్కటి సంకేతం అని మంత్రి నాదెండ్ల తెలిపారు. ధాన్యం కొనుగోలులో, సన్నబియ్యం పథకంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని, ఏపిలో దీపం- పథకం కింద ఒక కోటి పది లక్షల లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని, 41వేల ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనం, నాలుగు వేల హాస్టళ్లలో ఉచిత బియ్యం అందిస్తున్నట్లు వివరించారు.