టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్
ముంబై: సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల స్థానాలను భర్తీ చేయడం అనుకున్నంత తేలికేం కాదని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లోనే రోహిత్, విరాట్‌లు అసాధారణ ఆటగాళ్లు అని కొనియాడాడు. వీరిద్దరూ ఏకకాలంలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం జట్టుపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే ఏ ఆటగాడికైనా ఏదో ఒక సమయంలో ఆట నుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నాడు. కోహ్లి, రోహిత్‌లను రిటైర్మెంట్ నిర్ణయం మార్చుకోమని ఎవరూ కూడా చెప్పలేరన్నాడు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఇక భారత క్రికెట్‌పై వీరిద్దరూ తమదైన ముద్ర వేశారన్నాడు.
వీరి లేని లోటు జట్టుపై స్పష్టంగా కనపడుతుందన్నాడు. కానీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ దీని నుంచి త్వరలోనే బయటపడుతుందనే నమ్మకాన్ని గంభీర్ వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. గతంలో కూడా పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పడూ స్వల్ప వ్యవధిలో భారత బ్యాటింగ్ పుంజుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా యువ ఆటగాళ్లు వీరి లోటును పూడ్చడం ఖాయమన్నాడు. అయితే ఇది అనుకున్నంత సులువు కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్ తమకు సవాల్ వంటిదేనన్నాడు. కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతుండడంతో జట్టు కాస్త ఒత్తిడిలో ఉన్న విషయం వాస్తవమేనన్నాడు.