‘అవును. వాళ్ళు మరణిస్తారు. వీళ్ళంటున్న ఈ ఆఖరి యుద్ధంలో చిట్టచివరి వీరుడూ నేలకొరిగాక ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల దస్త్రాలు దుమ్ము దులిపి బయటకు తీస్తారు. ఆదివాసుల్ని వాళ్ళ నేలనుండే బహిష్కరిస్తారు. వెళ్ళని వాళ్ళని ఎప్పటిలానే, చరిత్ర పొడుగుతా జరిగినట్లుగానే గూడేలకు గూడేలు తగలబెడతారు.ఈ మారణకాండను చూసిన చెట్లు ఎక్కడ సాక్ష్యం చెబుతాయోనని వేర్లతోసహా పెకలించివేస్తారు. ముక్కలై మాంసంలో కలిసి ఎగుమతైన స్పార్టకస్ అంశతో ఎవడో పుడతాడు. భగత్ సింగ్ పక్కింట్లో పుడతాడు. నల్లా ఆదిరెడ్డో, నంబాల కేశవరావో ఎవడో ఒకడు. స్వర్ణక్కో, రేణుకో, పద్మో ఎవరో ఒకరు. మళ్ళీ వచ్చార్రా… వీళ్ళది పోరాటమంటే.. అని నలుగురం కూడి చీర్స్ చెప్పుకుంటూ వాళ్ళ పోరాటాన్ని మాట్లాడుకుందాం. తల ఉందంటే తెగి పడుతుంది. వెన్నెముక నిటారుగా ఉంటే విరిగిపోతుంది’ అని మావోయిస్టు పార్టీ అభిమాని ఒకరు మే 22 న సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. కాగా ‘ఒక అధ్యాయం ఇక ముగిసినట్లే.
నూతన అధ్యాయం ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెబుతుంది’ అని ఒక మాజీ మావోయిస్టు పార్టీ నాయకుడు ఒకరు అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ వార్త గుప్పుమనగానే ఆయన తక్షణ స్పందన ఇది! ‘భారత సైనిక బలగాలు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులపై పైచేయి సాధించవచ్చు కానీ, వాళ్ళు ప్రజల్ని జయించినట్టు కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా కేవలం అడవులకు మాత్రమే మనం ఎందుకు పరిమితమయ్యామో ఆలోచించుకోవాలి అని మావోయిస్టు పార్టీ సిద్ధాంత కర్తలలో ఒకరైన కోబాడ్ గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. నిజమే! ఆయన మాటలను మావోయిస్టు పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవలసిందే.
‘పోరాటంతో ఆటలాడొద్దు. మీ ఆటల పర్యవసానాలను ఎదుర్కొనే సంసిద్ధత లేకపోతే అసలు విప్లవంతో ఆటలాడొద్దు. విప్లవం అంటే ప్రతిరోజూ మారిపోయే అనంతమైన పరిణామాలను గణించే విధానం. మిమ్మల్ని వ్యతిరేకించే రాజ్యానికి అధికారం, సైనిక బలం పుష్కలంగా ఉన్నాయి. మీరు అంతకన్నా బలంగా లేకపోతే ఓడిపోతారు. నశించిపోతారు’ అని మార్క్ ‘న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్’ లో ఒక వ్యాసంలో వివరించారు. ‘రాజకీయ వ్యూహం, దానికి అనుగుణంగా ఉండే మిలిటరీ ఎత్తుగడలు రెండింటిలోనూ తప్పులు జరిగాయి. 1920-1940 మధ్య చైనాలో విజయవంతమైన వ్యూహాన్ని మావోయిస్టులు అనుసరిస్తున్నారు. ఆ వ్యూహం మొత్తం దేశానికి ఆపాదించలేం. భారతదేశంలో వ్యవసాయ సమాజం, ఆర్థిక రంగం రెండూ బహుముఖాలుగా చీలిపోయి ఉన్నాయి. మావో రూపొందించిన వ్యూహం మన దేశంలో కూడా విజయవంతమవుతుందన్న ఊహల్లోనే మావోయిస్టు పార్టీ నాయకత్వం ఉండిపోయింది. చైనాలో కామ్రేడ్లు జరిపిన పోరాటం కంటే, భిన్నమైన పరిస్థితుల్లో, భిన్నమైన పోరాటం తాము జరుపుతున్న వాస్తవాన్ని విప్లవకారులు తెలుసుకోవాలి’ అని నక్సలైట్ ఉద్యమ విశ్లేషకుడు, చరిత్రకారుడు సమంత బెనర్జీ ఒక వ్యాసంలో అన్నారు.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మే 21న ఎన్‌కౌంటర్ చేయడంతో నక్సలైట్ నాయకత్వం పతనం అంచున ఉన్నట్టు కనబడుతోంది. కొద్దిమంది పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే చురుకుగా ఉన్నట్టు తాజాగా ఐ.బి వర్గాల అంచనా. రామన్న, హరిభూషణ్, రామకృష్ణ, కటకం సుదర్శన్ వంటి ప్రధాన నాయకులు అనారోగ్యం కారణంగా మరణించారు. లేదా ఎన్‌కౌంటర్లకు బలయ్యారు. సీనియర్ నాయకుడు చలపతి ఇటీవల గరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. జార్ఖండ్‌కు చెందిన అగ్రశ్రేణి నాయకుడు ప్రశాంత్ బోస్‌ను అరెస్టు చేశారు. ఈ ఎదురు దెబ్బలతో నక్సలైట్ నెట్‌వర్క్ చావుదెబ్బ తిన్నది. కీలకమైన నక్సలైట్ నాయకుల కదలికలను ట్రాక్ చేయడానికి భద్రతా దళాలు డ్రోన్‌లు, ఉపగ్రహ ఇమేజింగ్, ఇన్‌ఫార్మర్ల నెట్‌వర్క్‌లను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నది.
మావోయిస్టు నాయకుల చుట్టూ ఉచ్చు బిగించడానికి సిఆర్‌పిఎఫ్ బెటాలియన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ యూనిట్లను బలోపేతం చేశారు. మావోయిస్టులకు ఆర్థిక, లాజిస్టికల్ మద్దతు వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. నిధుల కొరత, కీలక నాయకుల ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు (Maoist)ఉద్యమ ప్రభావాన్ని బలహీనపరిచాయి. ‘శత్రువు బలం ఎక్కువగా ఉండి, నీ బలం తక్కువగా ఉన్నప్పుడు, నీ బలమైన ప్రాంతాల్లో నీకున్న శక్తులన్నీ కూడగట్టుకొని శత్రువుకు చెందిన చిన్న చిన్న విభాగాలపై బలమైన మెరుపుదాడులు చేసి విజయాలు సాధించాలి’ అనేది మావో చెప్పిన గెరిల్లా యుద్ధవ్యూహాల్లో ఒకటి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జరుపుతున్న దాడులతో మావోయిస్టుల ‘బలమైన’ ప్రాంతాల్లోనూ కదిలే పరిస్థితిలేని కట్టడి కనిపిస్తోంది. మావోయిస్టులపై కేంద్ర బలగాల తుది పోరాటం అత్యంత కీలకమైన దశలో ఉంది. బిజెపి అనుబంధ సంస్థ సొంత పత్రిక ‘ఆర్గనైజర్’ కథనాన్ని బట్టి, గ్రామీణ, మారుమూల, అడవులు, కొండ, కోనల్లో మావోయిస్టుల సాయుధ గెరిల్లా దళాలను తుదముట్టించే ‘ఆపరేషన్ కగార్’కు సమాంతరంగా, మావోయిస్టుల రాజకీయ అభిప్రాయాలను సమర్ధించే వాళ్ళను ఏరివేసే చర్యలు కూడా ముమ్మరం కావచ్చు.
పట్టణాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, పౌరహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ఇతర ప్రజాసంఘాల కదలికలపై నిఘా తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలు, సికాస వంటి సంఘాలలో ఇదివరకు పనిచేసి ప్రస్తుతం వివిధ నగరాల్లో, రాష్ట్రాల్లో, విదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడిన వ్యక్తుల కార్యకలాపాలపైనా నిఘా పెంచనున్నారని తెలియవచ్చింది. ‘కేంద్ర ప్రభుత్వ భద్రతాసంస్థల అధ్యయనాలలో అర్బన్ నక్సలిజం నాల్గవ తరం యుద్ధం (4 వ జనరేషన్ ) పరిధిలోకి వస్తుంది. నక్సలిజం పరిధి కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితంకాదని అర్థం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో పని అనేది మావోయిస్టు వ్యూహంలో ఒక భాగం, దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ 2004లో జారీ చేసిన ‘అర్బన్ పెర్స్పెక్టివ్’, ‘భారత విప్లవ వ్యూహాలపై’ పత్రాలలో విస్తృతంగా వివరించింది.
పట్టణ ప్రాంతాల్లో నక్సల్ కార్యకలాపాలపై దృష్టి సారించే పత్రంలోని విభాగాలు భారతదేశంలో అర్బన్ నక్సలిజం సైద్ధాంతిక చట్రాన్ని అందిస్తాయి. ప్రజాయుద్ధానికి, విముక్తి పొందిన ప్రాంతాల స్థాపనకు అవసరమైన వివిధ రకాల సామర్థ్యాలను కలిగి ఉన్న కార్యకర్తలు, నాయకత్వాన్ని అందించే ప్రధాన వనరులలో పట్టణ ఉద్యమం ఒకటి అని వారి పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి… అంతేకాకుండా, ప్రజా యుద్ధానికి సరఫరాలు, సాంకేతికత- నైపుణ్యం, సమాచారం, ఇతర వస్తువులను అందించే బాధ్యత కూడా పట్టణ విప్లవ ఉద్యమం భుజాలపైనే ఉంది. 2015- 16లో ఎఫ్‌టిఐ, హెచ్‌సియు, ఐఐటి చెన్నై, జెఎన్‌యు, ఉస్మానియా, జాదవ్‌పూర్, ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల క్యాంపస్‌లలో భారత జాతి విచ్ఛిన్నతను సమర్థించే నినాదాలు తరచూ ప్రతిధ్వనిస్తున్నట్టు ఒక నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి అందజేసినట్టు సమాచారం అందుతోంది.
అర్బన్ నక్సల్స్ గ్రామీణ ప్రాంతాల్లోని మావోయిస్టులకు ఆయుధాలు, ఔషధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి ముఖ్యమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా మద్దతు ఇస్తున్నట్టు ఆ నివేదికలో తెలిపారు. అదే సమయంలో కొన్ని ‘కవర్ ఆర్గనైజేషన్స్’ను ఏర్పాటు చేసి, దళ సభ్యులుగా తయారు చేస్తున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలంటున్నవి. తమ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్క్‌లను అర్బన్ నక్సలైట్లు వాడుతున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నవి. ‘సైనిక, పారామిలిటరీ దళాలు, పోలీసులు, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని ఉన్నత స్థాయిలలోకి చొచ్చుకుపోవాలి. శత్రువు గురించి సమాచారాన్ని సేకరించాలి. ఆయా వ్యవస్థలలో విప్లవానికి మద్దతును కూడగట్టాలి. సమయం వచ్చినప్పుడు తిరుగుబాటును ప్రేరేపించాలి’ అని పట్టణ ప్రాంతాల్లోని మేధావులు, రచయితలకు నిర్దేశిస్తున్నట్టుగా మావోయిస్టు పార్టీకి చెందిన ఒక ‘వ్యూహ పత్రం’లో బయటపడినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి.
- ఎస్.కె. జకీర్