పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు తర్వాత దేశంలో గూఢచర్య కార్య్కలాపాలకు పాల్పడుతున్న పలువురిని భారత నిఘా అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు కీలక సమాచారం అందిస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతోపాటు 11మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ నిఘా ఏజెంట్లకు కీలక సమాచారం అందిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్(ATS) శనివారం కచ్ సరిహద్దు జిల్లాకు చెందిన 28 ఏళ్ల ఆరోగ్య సిబ్బందిని అరెస్టు చేసింది. పాకిస్తాన్ నిఘా అధికారి తరపున గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నాడని ఆరోపించింది. గత ఎనిమిది నెలల్లో గూఢచర్యం ఆరోపణలపై గుజరాత్ లో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మాతా-నా-మధ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్త(MPH) సహదేవ్సిన్హ్ దీపుభా గోహిల్.. సరిహద్దు భద్రతా దళం (BSF), భారత నావికాదళానికి సంబంధించిన సున్నితమైన ఫోటోలు, వీడియోలను పాక్ కు అందించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.