Sunday, May 25, 2025

కేరళను తాకిన రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శ నివారం కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే ఈ ఏడాది 8 రోజులు ముందుగానే కేరళను నై రుతి రుపవనాలు తాకడంతో, 2009 తరువాత భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని ఐఎండి తెలిపింది. 16 సంవత్సరాల తరువాత నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందుగా భారతదేశాన్ని తాకాయి. చివరి సారిగా 2001, 2009లో రుతుపవనాలు అంచనా వేసిన సమయం కంటే ముందుగా కేరళలో ప్రవేశించాయి. ఆ రెండు సంవత్సరాలు మే 23వ తేదీనే కేరళకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. సాధారణంగా జూన్1వ తేదీ నాటికి రుతుపనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.

అయితే 1918వ సంవత్సరంలో అత్యంత వేగంగా మే 11వ తేదీన కేరళను రుతుపవనాలు తాకి రికార్డు సృష్టించాయి. కాగా, ఆలస్యంగా కేరళను నైరుతి తాకిన రికార్డు 1972వ సంవత్సరంలో నమోదయింది. ఆ ఏడాది జూన్ 18వ తేదీ నాటికి రుతువపనాలు ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలలో 2016, జూన్9వ తేదీన ఆలస్యంగా రుతువనాలు కేరళలో ప్రవేశించాయి. గతేడాది మే 30వ తేదీన, 2023లో జూన్ 8వ తేదీన, 2022లో మే 29వ తేదీన, 2021లో జూన్ 3వ తేదీన, 2020లో జూన్ 1వ తేదీన, 2019లో జూన్ 8వ తేదీన, 2018లో మే 29వ తేదీన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ సంవత్సరం అన్నింటికంటే వేగంగా కేరళను తాకి 16 ఏళ్ల తరువాత రికార్డు సృష్టించాయి.

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు
నైరుతి రుతుపవానాలు కేరళను తాకడంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో పాటుగా మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. నైరుతి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News