రాష్ట్రంలో పరిపాలన, శాంతిభద్రతల పరిస్థితి, మీడియాలో వస్తున్న వార్తలగురించి రోజూ ఉదయమే ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు బ్రీఫింగ్ ఇస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నిఘా విభాగం అధిపతి, సమాచార శాఖ కమిషనర్ రోజూ ఉదయమే మొట్టమొదట ముఖ్యమంత్రిని కలిసేవాళ్ళలో ఉంటారు. వాళ్లు ముఖ్యమంత్రికి ఈ అంశాలమీద బ్రీఫ్ చేస్తారు. వాళ్ళ బ్రీఫింగ్‌ను బట్టి ముఖ్యమంత్రి తానేం చేయాలో నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇది ఇవాళ్టి పద్ధతి కాదు, అనాదినుండి మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా దాదాపుగా ఇలాగే జరుగుతుంది. ఈ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలవలేకపోయిన సందర్భాలలో కనీసం టెలిఫోన్లోనైనా బ్రీఫ్ చేయడం అనేది కొనసాగుతూ వచ్చిన పద్ధతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉండిన ఒక అధికారి అత్యంత గోప్యంగా ఉంచవలసిన శాంతిభద్రతలకు సంబంధించిన రోజువారీ నివేదికలను ముఖ్యమంత్రికి కాకుండా ఆయన మంచిచెడ్డలు చూసుకునే ఒక సన్నిహిత బంధువుకు చెప్పాల్సి వస్తున్నది,
ఇది పద్ధతికి విరుద్ధమని తన సన్నిహితులతో చెప్పుకొని వాపోయేవాడు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ప్రగతి భవన్లో ఉండి ఎవరికీ అందుబాటులో ఉండేవారు కాదని బయట ప్రచారం. ముఖ్యమంత్రిగా ఆయన సచివాలయానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. మొత్తం ఆయన దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ మూడు నాలుగు సందర్భాల్లోనో సచివాలయానికి వెళ్లి ఉంటారు. అది ఆయన వ్యవహారశైలి. ఒక్కో ముఖ్యమంత్రికీ ఒక్కో రకమైన శైలి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉదాహరణగా తీసుకుంటే ఆయన దినచర్య ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యేది. దాదాపు 5:30 నుండి ఆయన అధికారిక కార్యక్రమాలు మొదలైనట్టే. పైన పేర్కొన్న అధికారులు ఆయనకు బ్రీఫింగ్ ఇవ్వడం, సరిగ్గా తొమ్మిది గంటలకు గడియారం చూసుకుని క్యాంప్ ఆఫీస్ బయటకు వచ్చి ఆరోజు అక్కడికి వచ్చి వరుసలో నిలబడిన సామాన్య జనం ప్రతి ఒక్కరినీ స్వయంగా కలిసి వాళ్ల సమస్యలు విని మహజర్లు స్వీకరించి వాటికి సంబంధించి అధికారులకు ఆదేశాలు అక్కడికక్కడే జారీ చేసి తదుపరి క్యాంపు కార్యాలయంలో వేచి ఉన్న వాళ్లందర్నీ కూడా కలిసి 10:30 గంటలకల్లా సచివాలయం చేరుకునేవారు. ఇలా, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఈనాటి వరకు 18 మంది ముఖ్యమంత్రులు పాలించారు. ఒక్కొక్కళ్ళది ఒక్కో తీరు. ముఖ్యమంత్రి రోజూ అందరినీ కలవడం అంటే కిందినుండి పైదాకా అధికార యంత్రాంగం, ఇతర ప్రజాప్రతినిధులు పనిచేయడం లేదన్నట్టే కదా, సమస్యలు ముఖ్యమంత్రిదాకా రావాల్సిన పరిస్థితి ఉందంటే పరిపాలనలో లోపం ఉన్నట్టే కదా అనే వాదన ఆ మధ్య మాజీమంత్రి కెసిఆర్ కుమారుడు కెటి రామారావు ఒక సందర్భంలో వినిపించారు. ఇవన్నీ నిజమే కానీ, ముఖ్యమంత్రులు అయినా ప్రధానమంత్రులు అయినా ఎంత పెద్దవారైనా సరే కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. కెసిఆర్ అధికారంలో ఉండగా ప్రగతి భవన్‌లో ఉన్నా, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉన్నా ఆయన్ని కలవాలంటే కుటుంబ సభ్యులు కూడా అపాయింట్‌మెంట్ కోరాల్సిందేనని చాలాసార్లు విన్నాం. ముఖ్యమంత్రిని తాము కలవకుండా అడ్డుకుంటున్నాడని ఆయన రోజువారీ వ్యవహారాలు చూసుకునే మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆయన సమీప బంధువు సంతోష్ కుమార్‌ను నిందిస్తూ ఉండేవారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత చందంగా ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా సొంత బిడ్డలను కూడా కలవకుండా ఉండడం అనేది అసహజంగానే ఉంటుంది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మాజీ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తండ్రికి ముఖాముఖి చెపితే సరిపోయే విషయాలను ఓ లేఖలో రాసి పంపారు. సహజంగా తండ్రులకు కూతుళ్లపట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలకు తల్లికంటే తండ్రిదగ్గర చనువు ఎక్కువ. కవిత ఆ చనువు ఎందుకు కోల్పోయారు అన్నది ప్రశ్న. పార్టీ నడుస్తున్న తీరు, రజతోత్సవ సభలో తండ్రి ప్రసంగం సాగిన తీరు, ఆయన వ్యవహార శైలి మీద కొన్ని మంచి విషయాలు, కొన్ని మారాల్సిన విషయాలు వివరిస్తూ ఆమె మే రెండవ తేదీన రాసిన లేఖ అది. దాదాపు 20 రోజుల తర్వాత ఈ లేఖ మీడియాకు లీక్ అయింది. ఒకటి.. తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అయింది? రెండు.. ఎవరు లీక్ చేసి ఉంటారు? 24 గంటల్లోనే దీనిమీద మీడియా బోలెడు చర్చ చేసింది. కొందరు ఇది నకిలీ ఉత్తరం అన్నారు. మరికొందరు కాంగ్రెస్ వారే రాయించారు, వారే లీక్ చేశారన్నారు. మరికొందరు కవిత తనంతటతానే దీన్ని లీక్ చేయించారని ప్రచారం చేశారు. ఇంకాస్త దూరం వెళ్లి ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ఒక వాదన, లేదు లేదు బిజెపితో కలవబోతున్నారని మరొక వాదన, ఈ రెండూ కాదు, సొంత పార్టీ పెట్టబోతున్నారని ఇంకొక వాదన, అసలు ఇదంతా కెసిఆర్ ఆడిస్తున్న డ్రామా అని మరో వాదన జోరందుకున్నాయి. శుక్రవారం సాయంత్రం కవిత అమెరికా నుండి తిరిగి వచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడేంతవరకూ మీడియాకు బోలెడు మేత దొరికింది. ఏది తోచితే అది రాశారు, మాట్లాడారు.
కవిత ఆ లేఖ తాను రాసిందేనని, పార్టీలో ఉన్న కోవర్టులు ఆ లేఖను మీడియాకు లీక్ చేసి ఉంటారని, తాను పార్టీకి నష్టం చేసే మనిషిని కాదని వివరించేదాకా లేఖ అసలు, నకిలీ గురించి చాలా చర్చ జరిగింది. చాలా రోజులుగా భారత రాష్ట్ర సమితిలో కెసిఆర్ కింద మూడు అధికార కేంద్రాలు పని చేస్తున్నాయని, వాటి మధ్య అంతర్గత ఘర్షణ తీవ్రంగా ఉన్నదని వార్తలు వస్తూనే ఉన్నాయి. కవిత లేఖ, దానిమీద శుక్రవారంనాడు ఆమె స్పందన.. ఆ వార్తలను ధ్రువీకరిస్తున్నాయి. కవిత రాసిన లేఖలో ఉన్న అంశాలనే గనక తీసుకున్నట్లయితే నిజానికి కెసిఆర్ పరిగణనలోకి తీసుకొని మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఒక్కో రకంగా ఉంటుంది. కెసిఆర్ తన ఫీడ్ బ్యాక్ కోసం ఎటువంటి పద్ధతులను అనుసరిస్తారో మనకు తెలియదు. జనంలో మనం తిరగనప్పుడు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని పద్ధతులు అవలంబిస్తారు. కెసిఆర్ ఎటువంటి పద్ధతి అవలంబిస్తారో మనకు తెలియదు, కవిత మాటల ప్రకారమైతే అప్పుడప్పుడు తాను లేఖల ద్వారా ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తుంటానని చెప్పారు.
ఆమె లేఖలో పేర్కొన్న నెగటివ్ అంశాల విషయానికొస్తే రజతోత్సవంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయకపోవడాన్ని నెగిటివ్ అంశంగా పేర్కొన్నారు. నిజమే, భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లోనే గందరగోళం ఉన్నది.. భవిష్యత్తులో బిజెపితో తమది దోస్తీనా, దుష్మనీనా అని. ఎందుకంటే కెసిఆర్ మాట్లాడటం లేదు, కె.టి. రామారావు, హరీశ్ రావులాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అది శంఖంలో పోసిన తీర్థం కాబోదు. రజతోత్సవ సభలో వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడి ఉండవలసింది, దాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా, టిఆర్‌ఎస్‌తో నడిచే మైనారిటీలకు ఏం చెప్పదలచుకున్నారు, ఎస్‌సి వర్గీకరణకు సంబంధించి కూడా ఎందుకు మాట్లాడలేదు, బిసిలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు.. ఇలా ఆమె పలు అంశాలను ప్రస్తావించారు.
వీటిలో ప్రధానమైనవి ఉద్యమ నేతలను పట్టించుకోకపోవడం, కొద్దిమందికే అందుబాటులో ఉండడం అనేవి ప్రధానమైన విషయాలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు వీలైనంత ఎక్కువమందిని కలిస్తేనే ప్రజామోదం పొందగలుగుతాడు. ఆ విషయాలను కవిత ప్రస్తావించారు. దీనికి తప్పు పట్టాల్సిందేమున్నది? కవితకు, కెసిఆర్‌కు మాత్రమే తెలియాల్సిన, ఇంకెవరికీ తెలియకూడని రహస్య విషయాలు ఆ లేఖలో ఏమున్నాయి? నిజానికి ఆమె రాసిన
చివరి మాట కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవిరీవన్ అన్నమాట ఒక్క కెసిఆర్‌కే కాదు, రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది. అది ఎవరు లీక్ చేసి ఉన్నా ఇప్పుడు అందులోని అంశాల మీద చర్చ జరగడం మంచిదే. ప్రతిపక్షంలో కూర్చుని ఉన్న టిఆర్‌ఎస్ బలోపేతానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. శ్రేణులనుండి, కిందిస్థాయి నాయకులనుండి ఈ లేఖమీద వచ్చే స్పందనలనుబట్టి తమ పద్ధతులు, తమ ధోరణలను అవసరమైన మేరకు మార్చుకోవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నంతకాలం, తాను ఎంపిగా ఉన్నంతకాలం, ఆ తరువాత ఓడిపోతే కూడా ఎందరో అర్హులను కాదని ఆమెను మండలికి పంపించిననాడూ అధినేత వ్యవహార శైలి, ఆయన చుట్టూ చేరిన దయ్యాలు కవితకు కనిపించలేదా అన్న విమర్శ కూడా సహజమే. సరే, ఇంతకీ కెసిఆర్ అనే దేవుడి చుట్టూ తిరుగుతున్న దయ్యాలు ఎవరు? కవిత బాణాలు ఎవరిమీద ఎక్కువ పెట్టారు? ఆమె భవిష్యత్తు ఏమిటి? అనే అంశాలమీద ఇప్పటి పరిస్థితుల్లో చర్చ జరగడం సహజమే. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వచ్చిన ఆరోపణల కారణంగా కొద్ది మాసాలు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండి వచ్చిన కవిత రాజకీయ గుర్తింపు కోసం ఇదంతా చేస్తున్నారా అని కూడా చర్చ జరుగుతున్నది. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కెసిఆర్ తదితరులకు ఇచ్చిన నోటీసులనుండి జనం దృష్టి మళ్లించడానికి కవిత వ్యవహారం బయటికి తెచ్చారా,
నిజంగానే నిరాదరణ సహించలేక కవిత తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నారా అనే చర్చ కూడా జోరుగా సాగుతున్నది. కవిత కెసిఆర్ కూతురు కాబట్టి ఈ చర్చ జరుగుతున్నది. ఇటువంటి అంశాలు గతంలో భారత రాష్ట్ర సమితిలో ఉండిన పలువురు నాయకులు ప్రస్తావించడమూ, అధినేత ఆగ్రహానికి గురై బయటకు వెళ్ళడమూ జరిగాయి. గతంలో కొందరితో వ్యవహరించిన విధంగా పార్టీ అధిష్టానం కవితపట్ల వ్యవహరించకపోవచ్చు. ‘తూచ్, మా మధ్య ఏ గొడవలూ లేవు ఇదంతా మీడియా, మా శత్రు రాజకీయ పార్టీల సృష్టి అని’ తెలంగాణ భవన్‌లో కెటిఆర్, కవిత కలిసి జమిలి స్వరం వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదిఏమైనా, కవిత లేఖను బట్టి ఆ పార్టీలో ప్రస్తుతం అంతా సజావుగా లేదన్నమాట వాస్తవం. కవిత అన్నట్టు పార్టీలో అధినేత చుట్టూ నిజంగానే కొన్ని దయ్యాలు తిరుగుతున్నట్టయితే తేలిగ్గా తీసుకోకుండా వాటిని గుర్తించి బయటికి పంపితే ఆ పార్టీకే మంచిది.