ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో (Harvard University) విద్యార్థుల ప్రవేశాన్ని ట్రంప్ ప్రభుత్వం నిషేధించడం అక్కడ ప్రస్తుతం చదువుతున్న వేలాది మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ నగరాల్లో ఉన్న క్యాంపస్‌ల్లో 6800 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడ ఏటా ప్రవేశం పొందుతున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్శిటీలో (Harvard University) ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 10,158 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. 202425 విద్యా సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో కలిపి 788 మంది భారతీయ విద్యార్థులు నమోదయ్యారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం తరువాత ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ కావలసిన గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
లేకుంటే వారు చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం తప్పదు. అయితే తాము విధించిన ఆరు షరతులకు యూనివర్శిటీ అంగీకరిస్తే విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని యథాతధంగా కొనసాగించవచ్చని ట్రంప్ సర్కారు మెలిక పెట్టింది. ట్రంప్ ఆదేశాలను సవాలు చేస్తూ హార్వర్డ్ యూనివర్శిటీ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన బోస్టన్‌లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అల్లిసన్ బుర్రోగ్స్ శుక్రవారం ట్రంప్ యంత్రాంగం జారీ చేసిన నిషేధాజ్ఞలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఏదెలాగైనా హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి ఇక వీలు లేనట్టే. ప్రస్తుతం అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు వేరే యూనివర్శిటీకి బదిలీ కావాలి. లేకుంటే వారిని అక్రమ ప్రవాసులుగా పరిగిణించాల్సి వస్తుందని అమెరికా అంతర్గత భద్రతా విభాగం హెచ్చరిస్తోంది. ట్రంప్ సర్కారు ఉత్తర్వుల ప్రకారం స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్‌ఇవిపి) సర్టిఫికేషన్ రద్దు చేయడంతో ఎఫ్1 లేదా జే1 వీసా కింద విదేశీ విద్యార్థులకు ఈ యూనివర్శిటీలో ప్రవేశార్హత ఉండదు. ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 140 పైచిలుకు దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, మేధావులకు, బోధకులకు ఆతిథ్యమిచ్చే సామర్థం హార్వర్డ్ యూనివర్శిటీకి ఉందని, దీన్ని సజావుగా కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని హార్వర్డ్ ప్రతినిధ జాసన్‌న్యూటన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ విదేశీ ప్రతిభావంతులు యూనివర్శిటీని, దేశాన్ని సుసంపన్నం చేస్తున్నారని ఉదహరించారు. భారత విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏకంగా 900 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతోందని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విద్యా సలహాదారు అజయ్ భుటోరియా గుర్తు చేశారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ, వైద్య తదితర రంగాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం వెనుక భారత విద్యార్థుల కృషి ఎనలేనిదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రెడ్‌కార్పెట్ పరిచేందుకు బ్రిటన్, కెనడా దేశాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌లోని ఒక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్‌లో తదుపరి విద్యాసంవత్సరం కొనసాగించలేని విద్యార్థుల కోసం హాంగ్‌కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయం చేస్తామని తెలియజేసింది. హార్వర్డ్ వర్శిటీ విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం ప్రకటించడంపై చైనా తీవ్రంగా విమర్శలు చేసిన వెంటనే హాంకాంగ్ యూనివర్శిటీ ఈ అవకాశాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం హార్వర్డ్‌లోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 1000 కంటే ఎక్కువ సంఖ్యలో చైనా విద్యార్థులు చదువుతున్నారు. హార్వర్డ్ క్యాంపస్‌లో గత సంవత్సరం చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇచ్చారని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఆరోపించడం
ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. అలాగే అమెరికా వ్యతిరేక, ఉగ్రవాద సమర్ధకులు యూదు విద్యార్థులను వేధించడం, దాడి చేయడానికి హార్వర్డ్ క్యాంపస్‌లో అనుమతించడం జరిగాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాచీన ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్‌ను చిక్కుల్లో పెడుతున్నారు. యూనివర్శిటీకి మంజూరయ్యే కొన్ని మిలియన్ల డాలర్ల నిధులను గ్రాంట్లను స్తంభింప చేశారు. ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రతిభావంతులను హార్వర్డ్ యూనివర్శిటీ ఆకర్షిస్తోంది. వారు నచ్చి ఎంచుకున్న ఆయా రంగాల్లో ఆరితేరేలా శిక్షణ కల్పిస్తోంది. ఉదార వాదానికి, విజ్ఞాన సృష్టికి, ప్రపంచీకరణను ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తోంది. కానీ ఈ యూనివర్శిటీలో మైనారిటీలకు, ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్లకు ప్రవేశం లేకుండా నిరోధించే పోకడలు కనిపిస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ విదేశీ విద్యార్థుల విరాళాలు, ఫీజుల పైనే ఎక్కువగా ఆధారపడుతోందని, వారికి విశేషాధికారాల వీసాలను కల్పిస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ట్రంప్ ఉత్తర్వులకు కోర్టులు తాత్కాలికంగా బ్రేకు వేసినప్పటికీ, ఇప్పుడు జరిగిన నష్టం కేవలం హార్వర్డ్ వర్శిటీకే కాదు, అమెరికా ఉన్నత విద్యాసంస్థల ప్రతిష్టకు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తీరని నష్టం ఏర్పడింది.