ఆయన కూతురు కాబట్టే మీడియా ప్రాధాన్యత
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్:బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిల్లలు దారితప్పారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కెసిఆర్ లోతుగా ఆలోచన చేసే వ్యక్తి అని, కెసిఆర్ గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆమె కెసిఆర్ కూతురు కాబట్టే మీడియా ప్రాధాన్యత ఇస్తుందని, అమె వల్ల రాజకీయాలు ఏమీ తారుమారు కావు అని తెలిపారు. కవిత ఎపిసోడ్ వల్ల బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం కలసాకారం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ కి పదేళ్లు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని వివరించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం జనాధరణతో ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని, బిఆర్‌ఎస్, బిజెపి ఆతర్వాత స్థానాల్లో ఉన్నాయి, బిజెపి మతం పేరుతో చేసే రాజకీయాలు ఎంతో కాలం నిలువవని తెలిపారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కెసిఆర్.. కెసిఆరే, ఆయనతోనే ఆ పార్టీకి ఉనికి, కెటిఆర్, హరీష్‌రావు, కవిత వల్ల ఏమీ కాదు, కవిత స్వతహాగా లీడర్ కాదు, కెసిఆర్‌ను దేవుడు అంటూనే…కవిత ఏ చెట్టు నీడలో బతుకుతున్నారో, ఆ చెట్టు నరికేస్తున్నది, కూర్చున్న చెట్టు కొమ్మని నరికినట్టు ఉంది కవిత వ్యవహారం అని ఆయన వివరించారు.