నేను ధాన్యంలోంచి పుట్టాను.
ధాన్యం కోసమే బ్రతుకుతాను
మరణించి ధాన్యంలోకే వెళతాను
నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా
ఈ చేత్తో నేను ఏ అందాన్నీ సృష్టించలేదు
ఏది ఈ భూమి మీద ఈ చేతికి
లొంగలేదు
కానీ,.. ఈ చెయ్యి ఖాళీగానే
వుండిపోయింది
శాశ్వతంగా
గడచిన చరిత్రలో నాకు తావు లేదు.
ఇప్పుడు నడిచే చరిత్రకు నీతిలేదు
నా జ్ఞాపకాల ఊరేగింపుకు
నేనే నాయకుడ్నిగా..
రగిలే నా ఎర్రకోరికే ఒక జెండాగా
(ఒకటోసర్గ)
నీకు ఈ తిండిగింజలు
ఎలా వస్తున్నాయో తెలుసా?
ఈ నేల ఎవరు దున్నుతున్నారో తెలుసా..
ప్రాణదాన సాధనం, ఈ నాగలి. ఎవరు చేస్తున్నారో తెలుసా!
మట్టిశక్తి అవగాహన చేసుకో బిడ్డా!
నా దేశం.. నా ప్రజలు ఎవరి కోసం?
శేషేంద్ర శర్మ తన కవిత్వ భాషను సృష్టించుకు న్నాడు. కేవలం భాష మాత్రమే కాకుండా సరికొత్త అభివ్యక్తిని ఎంచుకున్నాడు. అచ్చెరువొందే ప్రతీకలతో ఓ తుపాను సృష్టించాడు
విప్లవ వస్తువును ఆధునిక రూపకళాసృష్టిలో లీనం చేసిన కవి శేషేంద్ర. అందుకే ఆయన కవిత్వం చదువుతున్నా, వింటున్నా విప్లవ సంగీతంలా వుంటుంది. ఆ సంగీతంలోని సరిగమలు విప్లవానికి జేజేలు పలుకుతున్నట్లు అనిపిస్తుంది
గుంటూరు శేషేంద్రశర్మ దేశం గురించి, దేశ ప్రజల గురించి కలవరించి, పలవరించిన కావ్యేతిహాసం నా దేశం నా ప్రజలు. ఈ కావ్యం తొలి ముద్రణ 1975, మే నెల లో జరిగింది. ఈ సంవత్సరం 2025 మే నెల ఈ ఐతిహాసిక కావ్యానికి యాభైయేళ్ళు నిండుతున్నాయి. అంటే స్వర్ణోత్సవ సంవత్సరమన్న మాట. 1975లో శేషేంద్రశర్మ గారు ఈ కావ్యాన్ని రాశా రు. నిజానికి ఈ కావ్యం ఇప్పుడు రాసినట్టే తాజా గా వుంటుంది. భావం, భాష, వస్తువు, వ్యక్తీకరణ లో, ఈ కృతి నేటికీ ఆధునికంగా నిలిచి వుండటం విశేషం.
50 యేళ్ళకు ముందు శేషేంద్ర ఈ కావ్యాన్ని ఏకబిగిన పది రోజుల్లో రాశారు. ఈ కావ్యాన్ని ఇంగ్లీషు భాషలోకి శర్మగారే అనువదించారు. కాగా ఈ కావ్యాన్ని డా.ఓంప్రకాష్ శర్మ హిందీ భాషలోకి అనువదించారు. అన్ని కావ్యాలు ఒకటి కావు. పాఠకుల్ని మెస్మరైజ్ చేసి, చైతన్యం రగిల్చే. ఆ కేటగిరీలోని కావ్యమే నా దేశం నా ప్రజలు.
“నేనెప్పుడు గొంతెత్తినా నాకోసం కాదు. ఐదు కోట్లమంది కోసమూ కాదు, యాభైకోట్ల మంది కోసం గొంతెత్తాను; నేను పడుతున్న బాధలే నా దేశమంతా పడుతోంది. నా మానవ జాతి అంతా పడుతోంది. కనకనే నా జ్వాలిక నా దేశపు నాలిక అదే నా దేశం నా ప్రజలు” ఇప్పటి ఆధునిక మహాభారతం ఇదే ఈ కావ్య రచన లక్ష్యం అంటారు శేషేంద్రశర్మ 1985లో ఆధునిక మహాభారతం అచ్చయింది. ఇందులో నా దేశం నా ప్రజలు కావ్యాన్ని ప్రజాపరం చేశారు.
మండే సూర్యుడు, గొరిల్లా, నీరైపారిపోయిం ది, ప్రేమ లేఖలు, సముద్రం నా పేరు, నేనూ.. నా నెమిలి, అరుస్తున్న ఆద్మీ, చమత్కారికలు, శేషజ్యోత్స్న వంటి శేషేంద్ర పూర్వ కావ్యాలన్నీ, పది పర్వాలుగా ఏకైక మహాకావ్యం ఆధునిక మహాభారతంగా అవతరించాయి. శర్మగారు చెప్పినట్లు కవి అనేక కావ్యాలు రాయడు. ఒకే కావ్యం రాస్తాడు. దాన్ని అప్పుడప్పుడూ క్రమక్రమంగా రాస్తూ వుం టాడు. శేషేంద్ర కూడా అంతే రాసింది ఒకే కా వ్యం. దాని పేరు నా దేశం నా ప్రజలు తర్వాతి నామాంతరం ఆధునిక మహా భారతం.
50 యేళ్ళ ఆధునిక ఇతిహాసం నా దేశం నా ప్రజలు ఇందులో ఎనిమిది సర్గలున్నాయి. ఆంధ్ర వాజ్ఞ్మయంలో Epic అనే ఇంగ్లీషు పదానికి ఇతిహాసం అనే భారతీయ భాషా శబ్దాన్ని వాడుతున్నారు. దీనికి కారణం బహుశా మహాభారతానికి అసలు పేరు జయేతిహాసం అవడమే కావొచ్చు అంటారు శేషేంద్రశర్మ. మానవ హస్తం శ్రమకు మూలస్థానం. శ్రమ మానవ నాగరికతకు జన్మస్థానం’ అనే ఆధునిక యుగీన చేతనకు ఇవ్వబడిన కావ్యరూపమే ఈ కావ్యేతిహాసం నా దేశం నా ప్రజలు.
ఈ కావ్యంలో రైతే నాయకుడు. దేశంతో మిళితమైన రైతు జీవిత ఇతివృత్తమే ఈ ఇతిహాసం. శ్రమ చేస్తే గానీ రోజు గడవని వాడు రైతు. నాగలి పట్టుకొని నేల దున్నుతాడు. అతడే మానవ జాతికి చిహ్నం. రైతు జీవితంలో ఏముంటుంది! శ్రమ, శ్రమ, శ్రమ.. తప్ప.. ఇంకేముంటుంది! అందువల్ల ఈ ఇతిహాసంలో కథ కోసం చూడకూడదు.
నా దేశం నా ప్రజలులోని దేశం, ప్రజలు మన భారత దేశానికే పరిమితమా? అన్న అనుమానం రావొచ్చు. నిజానికి శేషేంద్ర దీన్ని విస్తృతార్ధంలోనే వాడారనవొచ్చు. ఇందులో ప్రస్తావించబడిన దేశం, ప్రజలు భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. తత్వతఃసత్యం ఏమంటే? ఏకవైనా తనకు సోకిన, తన భావోద్రేకతను రెచ్చగొట్టే పరిసరాల్ని ఉద్దేశించే సంబోధిస్తాడు. రాస్తాడు. ఈ పరిధికి దూరమైన కాల దూరాలు అతని ఐంద్రియ సంబంధానికి అంటే, అనుభూతికి బాహిరమైనవి. ఏది అనుభూతి బంధంలో ప్రవేశిస్తుందో అదే కవి భావోద్రేకతకు హేతువు అవుతుంది. కాని, ప్రకృతి, మానవుడు సమాజం సాధారణంగా సమాన పరిస్థితుల్లో వుంటాయి గనక అంతకంటే ముఖ్యమైంది మాన వ స్వభావం.
మానవ చరిత్రలో స్వల్ప వ్యత్యాసాలున్నప్పటికీ, విశాలంగా చూస్తే ఒకే విధంగా నడిచాయి గనుక మానవుడు తనను గురించి ఉత్కృష్టంగా పొందే అనుభవం లేక ఆలోచన ఎప్పుడూ సమస్త మానవ జాతికి అన్వయిస్తుంది. నా దేశం నా ప్రజలు కావ్యంలో సంబోధింపబడిన వస్తువు సర్వమానవ జాతికి ఉద్దేశించబడింది. ఈ కావ్యంలో పునఃపునఃవచ్చే అహంకార స్వరూప ఉత్తమ పురుషైక వచనం ఒకవైపున వ్యక్తికి అయితే రెండవ వైపున సమస్త జగత్తు. ఈ మధ్యలో జరిగే సంవాద భాషే నా దేశం నా ప్రజలు అంటారు శేషేంద్ర.
కావ్య రచనలో ఈ కాలపు భాష కావాలంటాడు శేషేంద్ర. యాభైయేళ్ళ క్రితమే ఈ కాలపు భాషలో ఈ కావ్య రచన చేశారు శేషేంద్ర. ఈ కాలపు భాషే ఎందుక్కావాలంటే, ఈ కాలపు మనిషిని గురించి చెప్పుకునేటప్పుడు ఈ కాలపు భాషే వాడాలి గనుక ఈ కాలపు మనిషి పూర్వకాలపు మనిషి కాదు. ఈ నాటి మనిషి పూర్వకాలపు వ్యవస్థను విధ్వంసం చేయడమే తన ఏకైక లక్ష్యంగా నమ్ముతున్నాడు. కనుకనే ఈ కాలం భాషతో మని షి గానం చేయాలంటున్నాడు శేషేంద్ర. అందుకే శేషేంద్ర శర్మ తన కవిత్వ భాషను సృష్టించుకున్నాడు. కేవలం భాష మాత్రమే కాకుండా సరికొత్త అభివ్యక్తిని ఎంచుకున్నాడు. అచ్చెరువొందే ప్రతీకలతో ఓ తుపాను సృష్టించాడు.
నేను దేశాన్ని దున్నేవాడ్ని. ధాన్యానికి కాళ్ళు రావాలనీ ఆ కాళ్ళలో పేదల ముంగిళ్ళకు నడు ద్దామనే కలలు రావాలనీ వ్యూహాలు పన్నేవాడ్ని. దున్నిందంతా చూస్తూ దూరంగా కూర్చుంటా.. గాలికి నా నిట్టూర్పుల మేత వేస్తూ, బంగారు బస్తాలు మోసే వంగిన వృద్ధ కూలీలా ఉన్న పశ్చిమాన్ని చూస్తూ, కనుకనే చెట్లు ఈ దేశంలో తమ పిల్లలు ఎందుకు స్కూళ్ళకు పోతున్నారని కన్నీళ్ళు కారుస్తాయి. పైర్లు రోదిస్తాయి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యం ఇందులో చూడొచ్చు.
మన విమర్శకులకు శేషేంద్ర కవిత్వంలోని ’ఇంద్రజాలం’ కనబడలేదేమో ఆయనకు రావలసినంత పేరు, గుర్తింపు రాలేదు. శేషేంద్ర శ్రామిక శక్తికి ఇచ్చినంత ప్రాధాన్యత మరో దానికి ఇవ్వలేదు. శ్రమయేవ జయతే అనే దాని ప్రకారం శ్రమ లేకపోతే జయమే కాదు, జీవితం కూడా లేదని చెప్పాడు కవి. గుంటూరు శేషేంద్రశర్మ తన కవిత్వాన్ని ‘పరిగెత్తే ఎర్రగుర్రం’తో పోల్చాడు. దాని ప్రస్థానం అభ్యుదయం.
లక్ష్యం విప్లవం ఇంకో రకంగా చెప్పాలంటే శేషేంద్ర కవిత్వమంతా విప్లవ సంగీతమే. కేవలం కవిగా ఆయన కవిత్వం రాయలేదు. తన్ను తాను ఓ కార్మికుడిగా, కర్షకుడిగా ఊహించుకొని మరీ కవిత్వం రాశాడు. ఆయన కవిత్వం దారినిండా ‘ఎర్ర మందారా లే’ ‘శ్రమైక జీవుల పాదాలే’ వ్యక్తం!. ‘వనజ్వాలలు’ ఆయన కవిత్వానికి స్ఫూర్తి. శేషేంద్ర సహజంగానే సూర్యోపాసకుడు (విప్లవ రవి) కావడం వల్ల ఆయన కవిత్వంలో తీక్షణత కాస్తంత ఎక్కువే కనిపిస్తుంది. శేషేంద్రశర్మ కవిత్వంలో మల్లెలు, జాజు లు, సన్నజాజులు సైతం కొలిమిలో నుంచి తీసిన ఎర్రటి ఇనుప గోళాలనిపిస్తాయి. విప్లవ వస్తువును ఆధునిక రూపకళాసృష్టిలో లీనం చేసిన కవి శేషేంద్ర. అందుకే ఆయన కవిత్వం చదువుతున్నా, వింటున్నా విప్లవ సంగీతంలా వుంటుంది. ఆ సంగీతంలోని సరిగమలు విప్లవానికి జేజేలు పలుకుతున్నట్లు అనిపిస్తుంది. శేషేంద్ర కవిత్వంలోని భావనలు, ప్రతీకలు, అలంకారాలు, కావ్య వస్తువులన్నీ కూడా విప్లవ రసస్ఫోరకాలే లోక కల్యాణకారకాలే ఆయన కలం పట్టాడు. దేశం గురించి, దేశ ప్రజల గురించి కల గన్నాడు.
(మే 30న గుంటూరు శేషేంద్రశర్మ వర్థంతి)
ఎ. రజాహుస్సేన్