పాకిస్థాన్‌కి గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పాకిస్థాన్ కోసం పని చేస్తున్న వ్యక్తులను జల్లెడ వేసి పట్టుకొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) (CRPF) ఉద్యోగి మోతీరామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు మోతీరామ్ సున్నిత సమాచారం అందిస్తున్నట్లు గుర్తించారు. 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సిఆర్‌పిఎఫ్ (CRPF) ఉద్యోగి మోతీరామ్ టచ్‌లో ఉన్నట్లు బయటపడింది.
అనంతరం అతడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి జూన్ 6వ తేదీ వరకూ ఎన్‌ఐఎ (NIA) కస్టడీలో ఉండాలని ఆదేశించింది. మోతీరామ్‌పై వచ్చిన ఆరోపణలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అతను పాకిస్థాన్‌కు ఏ విధమైన రహస్యాలు అందించాడో విచారణలో వెలికి తీయాలని పేర్కొంది. మోతిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేశారు.