న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ (Covid-19) మళ్లీ భారత్‌లో వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1009 క్రియాశిల కేసులు ఉన్నాయి. వారం వ్యవధిలో 750 మంది కొత్తగా కరోనా సోకిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాహల్ కీలక సూచనలు చేశారు.
కరోనా (Covid-19) కొత్త వేరియంట్ల పట్ల ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయన.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసిఎంఆర్ (ICMR) చీఫ్ సూచించారు.