Thursday, May 29, 2025

అందాల పోటీలకు రూ.200 కోట్లు.. చేపపిల్లల పంపిణీకి రూ.100 కోట్లు లేవా?:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

అందాల పోటీలకు రూ.200 కోట్లు ఉంటాయి. కానీ చేప పిల్లల పంపిణీకి రూ100 కోట్లు లేవా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, పాలమాకుల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాలను శాసనమండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్‌తో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విగ్రహాలను ఆవిష్కరించడం ఎంత ముఖ్యమో వారి జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవడం అంతే ముఖ్యం అన్నారు. పండగ సాయన్న తన ప్రాణాలను లెక్కచేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలను వదలడం ఎంతోమందికి ఆదర్శం అని అన్నారు.

ప్రభుత్వం ముదిరాజ్‌లను ఉద్ధరించిందేమీ లేదని, ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా చేప పిల్లలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల్ని చెరువుల్లో, ప్రాజెక్టులలో పోసిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం జిల్లాల్లోనే చేప పిల్లలను పంపిణీ చేసి మిగతా జిల్లాలను మరిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో వానాకాలం రాకముందే టెండర్లకు పిలిచామని పేర్కొన్నారు. జూన్ నెల వచ్చినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం చేప పిల్లల టెండర్లు పిలవకపోవడం శోచనీయమని అన్నారు. .ఈ సంవత్సరమైనా బడ్జెట్ కేటాయించి అన్ని చెరువుల్లో, కుంటల్లో చేప పిల్లలు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం అభివృద్ధి పనుల పేరిట హెచ్‌ఎండబ్ల్యూఎస్ లో రూ.10 వేల కోట్లకు జిహెచ్‌ఎంసిలో రూ.7 వేల కోట్లకు, హెచ్‌ఎండిఏలో రూ.20 వేల కోట్లకు టెండర్లు పిలిచి సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి భూములు కొనుక్కున్నారని, కేవలం దాని కోసమే 6 లైన్ రోడ్డు వేసుకోవడానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

కమీషన్లకోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి లక్ష కోట్ల టెండర్లను పిలుస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న శాసనమండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ..బిసి-డిలో ఉన్న ముదిరాజ్‌లను బిసిఎలో చేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ముదిరాజుల్లో ఐక్యత లోపంతో ఇప్పటికీ 70 శాతం మంది అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఇప్పటికైనా అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేదల కోసం పోరాటం చేసి అమరులైన గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు బయటకు వస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే ప్రముఖుల విగ్రహాలు రాష్ట్రమంతటా నెలకొల్పుతున్నామని గుర్తు చేశారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన వెంటనే కేవల్ కిషన్ పండుగను అధికారికంగా నిర్వహించి సరిపడా నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన అనంతరం హైదరాబాద్‌కు తొలి మేయర్‌గా కృష్ణస్వామి ఎన్నిక కావడం ముదిరాజ్‌లందరికీ గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిజాప శ్రీకాంత్ రెడ్డి, ఎఎంసి మాజీ ఛైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, పిఎసిఎస్ ఛైర్మన్ కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు యామ ధర్మ, వివిధ గ్రామాల ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News