తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట సోమవారం రైతులు, బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో కొనుగోల ప్రక్రియ మందకొడిగా సాగుతోందదని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ శ్రీశైలం=హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్‌కి తీసుకువచ్చిన ధాన్యాన్ని నెలలకొద్దీ కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వారిని పట్టించుకోవడం
లేదంటూ బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నేనావత్ పత్య నాయక్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆమనగల్లు సిఐ జానకిరామ్ రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేష్, సీతారాం రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. ఒకానొక విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్య నాయక్, పార్టీ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతుల ధర్నా నేపథ్యంలో శ్రీశైలం=హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పత్యా నాయక్‌ను కల్వకుర్తి మాజీ ఎంఎల్‌ఎ జైపాల్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, బిఆర్‌ఎస్ కడ్తాల్ మండల అధ్యక్షుడు కంబాల పరమేష్, మాజీ ఎంపిటిసి సరిత పంతు నాయక్, మాజీ సర్పంచ్ సోనా శీను నాయక్ తదితరులు పరామర్శించారు.