పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 2025లో ఇది 15 వ ఘటన కాగా, ఈ నెలలోనే రెండో ఆత్మహత్య. పోలీసుల కథనం ప్రకారం , జమ్ముకశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని జీషాన్ నెల క్రితం కోటాకు వచ్చి.. ప్రతాప్ చౌరాహా ప్రాంతంలో పేయింగ్‌గెస్ట్‌గా ఉంటూ నీట్‌కు సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం ఆమె తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. తరువాత వారు తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించక పోవడంతో విద్యార్థి స్నేహితురాలికి కాల్ చేశారు. ఆమె జీషాన్ గది వద్దకు వెళ్లగా లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో … ఇతరుల సాయంతో తలుపులు పగులగొట్టారు. అక్కడ ఆ విద్యార్థిని ఉరి వేసుకొని ఉండడంతోవెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నీట్ అభ్యర్థి మే 3 న తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కోటా లోని పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ఏడాది ఇప్పటికే 14 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీసింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో పోలీసుల వైఖరిని తప్పుపట్టింది.