ఘాజీయాబాద్‌లో వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకోడానికి వెళ్లిన నోయిడా పోలీసు బృందంపై నేరస్థుడి సహచరులు కాల్పులు జరుపగా ఓ 28 ఏల్ల కానిస్టేబుల్ చనిపోయాడు. మసూరి ప్రాంతంలోని నహల్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడాలోని ఓ దోపిడి కేసులో ఖదీర్ కావలసిన నేరస్థుడు. అతడిని పట్టుకోడానికి పోలీస్ బృందం వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తలకు తుపాకీ గాయం కావడంతో కానిస్టేబుల్ సౌరభ్ కుమార్ దేశ్‌వాల్‌ను యశోద ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కానిస్టేబుల్ మృతి పోలీస్ శాఖకు తీరని లోటని గౌతం బుద్ధా నగర్ కమిషనరేట్ ప్రతినిధి తెలిపారు.
ఈ ఘటనలో సబ్‌ఇన్‌స్పెక్టర్లు సచిన్ రాథి, ఉదిత్ సింగ్, సుమిత్, నిఖిల్ కూడా గాయపడ్డారు. ఇదిలావుండగా గౌతం బుద్ధ నగర్ కమిషనర్ లక్ష్మీ సింగ్ తన జీతం నుంచి లక్ష రూపాయలను దేశ్‌వాల్ కుటుంబసభ్యులకు ప్రకటించారు. అంతేకాక జిల్లాలోని ప్రతి పోలీస్ తన జీతం నుంచి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారని కూడా తెలిపారు. కాగా గందరగోళం పరిస్థితిలో ఖదీర్ తప్పించుకున్నాడు, అయితే అతడిని తర్వాత మళ్లీ పట్టుకున్నారు. ఇప్పడు కస్టడీలోనే ఉన్నాడు. అతడిపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసులపై దాడిచేసిన ఖదీర్ సోదరుడు ఆదిల్, ఇంకా దాడిలో పాల్గొన్న ఇతరుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.