క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్న స్నేహశీష్ గంగూలీ, ఆయన భార్య అర్పిత ఒడిశాలోని పూరీ తీరం సముద్రంలో స్పీడ్‌బోట్‌లో వాటర్ స్పోర్ట్ ఆనందిస్తుండగా ఓ పెద్ద సముద్రపు అల వారి బోట్‌ను తలక్రిందులు చేసింది. అయితే తృటిలో వారికి ప్రమాదం తప్పిందని పోలీసులు సోమవారం తెలిపారు. లైట్‌హౌస్ వద్ద శనివారం సాయంత్రం వారు స్పీడ్‌బోట్ రైడ్‌ను ఆస్వాదిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ‘దేవుని దయవల్ల మేము బతికిబయటపడ్డాము. పెద్ద ఎత్తుతో అల రావడంతో మా పడవ తిరగబడింది. సముద్రంలో వాటర్‌స్పోర్ట్‌ను నిర్వాహకులు సరిగా రెగ్యులేట్ చేయడం లేదు. పది మంది ఎక్కాల్సిన స్పీడ్‌బోట్‌లో డబ్బుకు ఆశపడి ముగ్గురు, నలుగురినే ఎక్కించుకుంటున్నారు. బోటు తేలికగా ఉండటంతో భారీ అలకు తట్టుకోలేక తిరగబడింది.
ఈ విషయంపై నేను కోల్‌కతా చేరకున్నాక పూరీ ఎస్పీకి, ఒడిశా ముఖ్యమంత్రికి రాస్తాను’ అని అర్పిత పిటిఐ వీడియోలో తెలిపింది. ‘మమ్మల్ని సకాలంలో కాపాడిన లైఫ్ గార్డ్‌కు కృతజ్ఞతలు’ అని కూడా అన్నది. ‘సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మేము సముద్రంలో వాటర్ స్పోర్ట్‌కు సందేహించాము. అయితే ఆపరేటర్లు ఏమి కాదు అంటూ భరోసా ఇవ్వడంతో సముద్రంలోకి వెళ్లాము. కానీ మేమ సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే పెద్ద అల పడవను తలకిందులు చేసింది’ అర్పిత వివరించారు. కాగా ఓ ప్రయివేట్ కంపెనీ ఆధ్వర్యంలో శిక్షణ లేని సిబ్బంది స్పీడ్‌బోట్లను ఆపరేట్ చేస్తున్నారని, పెద్ద అల వచ్చినప్పుడు ఏమి చేయాలన్న నైపుణ్యం స్పీడ్‌బోట్ నడిపేవారికి(క్య్రూ) లేదని, పూరీ జిల్లా పాలకుల నుంచి తగిన అనుమతి లేకుండానే కంపెనీ వాటర్ స్పోర్ట్ నిర్వహిస్తుందని స్థానికులు తెలిపారు.