Thursday, May 29, 2025

విస్తరణపై మరోసారి భేటీ

- Advertisement -
- Advertisement -

నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి
వారంలో కేబినెట్, పిసిసి కార్యవర్గ విస్తరణ
ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో
లేకపోవడంతో వాయిదా 30న
మరోసారి ఢిల్లీకి రావాలని సిఎం రేవంత్,
పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు
అధిష్ఠానం ఆదేశం మంత్రివర్గ విస్తరణలో
అవకాశాలు రాని వారికి పిసిసి కూర్పులో
కీలక పదవులు ఎఐసిసి పెద్దలతో సిఎం
రేవంత్, పిసిసి అధ్యక్షుడి వరుస భేటీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో మంత్రివర్గ, పిసిసి కార్యవర్గ విస్తరణ జ రిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30వ తేదీన మరోసారి ఢిల్లీకి రావాలని సిఎం రేవంత్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అధిష్టానం సూచించింది. అయితే, సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌లు బిజీబిజీగా గడిపారు. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల భర్తీ గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వారు విన్నవించారు. దీంతో రేవంత్, మహేశ్ కుమార్ గౌ డ్‌లు వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సం తరించుకుంది. దీంతోపాటు రాహుల్‌గాంధీతో కెసి వేణుగోపాల్ భేటీ అయి మం త్రివర్గ విస్తరణ, పిసిసి కూర్పుపై చర్చించారు. అంతకుముందు కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి సమావేశం కావడంతో పాటు మంత్రివర్గ విస్తరణ, పిసిసి కూర్పులో పేర్ల గురించి చర్చించినట్టుగా తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణ లో అవకాశం రాని ఆశావహులైన ఎమ్మెల్యేలకు కచ్చితంగా పిసిసి కూర్పులో అవకాశం ఇచ్చేలా చూడాలని సిఎం రేవంత్, కెసి వేణుగోపాల్‌కు సూచించినట్టుగా తెలిసింది.

బిసిలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్‌కు పిసిసి అధ్యక్షుడి వినతి
అయితే మంత్రివర్గ విస్తరణపై భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అధిష్టానంపై ఒత్తిడి అధికంగా ఉండడంతో అధిష్టాన పెద్దలు కూడా ఆచితూచి వ్యవహారిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తరువాత మంత్రివర్గ విస్తరణ, పిసిసి కూర్పునకు సంబంధించి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు సోమవారం సాయంత్రం తన కుటుంబసభ్యులతో ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీని మర్యాదపూర్వకంగా పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కలవడంతో పాటు పిసిసి కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణలో బిసిలకు రెండు పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, జై బాపు, జై బీంల గురించి కూడా రాహుల్‌కు పిసిసి అధ్యక్షుడు వివరించారు.

పిసిసి కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు 70 శాతం అవకాశం
పిసిసి కార్యవర్గంపై ఇప్పటికే అధిష్టారం ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలిసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈనెల 30వ తేదీ తరువాత మరోమారు సిఎం రేవంత్‌ను, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లను ఢిల్లీ రావాలని అధిష్టానం సూచించింది. మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో కార్యవర్గం ప్రకటనవాయిదా వేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పిసిసి కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులను ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పిసిసి కార్యవర్గ కూర్పులో సామాజిక సమీకరణాలకు కూడా కాంగ్రెస్ పెద్దపీట వేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు సుమారు 70 శాతం అవకాశం కల్పించనున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

4 వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, 10 నుంచి 20 మంది ఉపాధ్యక్షులుగా…
ప్రస్తుతం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ పార్టీ నియమించనుంది. ఇందులో పార్టీ సీనియారిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళ కోటాలను పరిగణలోకి తీసుకుని ఈ పదవులను భర్తీ చేయనున్నట్టుగా తెలిసింది. దాదాపు 10 నుంచి 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా సమాచారం. పార్టీ జనరల్ సెక్రటరీ లేదా ప్రధాన కార్యదర్శి -పార్టీలో కీలకమైన పదవి. వీరు పార్టీలోని అంతర్గత, సంస్థాగత వ్యవహారాలను చూస్తారు. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉండేలా అధిష్టానం జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలిసింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఎక్కువ మంది ప్రధాన కార్యదర్శులు ఉండే అవకాశం ఉందని, మొత్తంగా దాదాపు 80 మంది ప్రధాన కార్యదర్శులుగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పార్టీ కార్యదర్శులుగా 40 మంది…
పార్టీ కార్యదర్శులు – పార్టీ తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తారు. దాదాపు 40 మందిని ఈ పదవుల్లో నియమించే అవకాశం ఉంది. పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్‌లుగా 5 నుంచి 10 మంది, పార్టీ క్యాంపెయిన్ కమిటీ లేదా ప్రచార కమిటీలకు సంబంధించి 5 నుంచి 10 మందికి అవకాశం -కల్పించనున్నట్టుగా తెలిసింది.

నాకు కూడా మంత్రి పదవి ఇవ్వండి: విజయశాంతి విజ్ఞప్తి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలో ఎవరికీ చోటుదక్కుతుందన్న దానిపై చర్చ నడుస్తోంది. మంత్రి పదవుల రేసులో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ప్రేమ్‌సాగర్ రావు, బాలునాయక్, రాంచంద్రా నాయక్‌ల పేర్లు వినిపిస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ,

సినీనటి విజయశాంతి పేరు కూడా తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు కేటాయించాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నట్టుగా సమాచారం. అయితే ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌ల్లో ఐదింటిని భర్తీ చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బిసిలకు 2, ఓసి 1, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులను భర్తీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇందులో మార్పులు, చేర్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఓసిలకు 2 మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉందని సమాచారం. క్రమ శిక్షణా కమిటీ -సభ్యులుగా 7 నుంచి 10 మంది తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సిఎం
మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ప్రధాని, మంత్రులను కలిసిన ఆయన ఆది, సోమవారాల్లో ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

రాష్ట్ర పరిస్థితుల గురించి రాహుల్‌కు వివరించా: పిసిసి అధ్యక్షుడు
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన అనంతరం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్‌కు వివరించానని ఆయన పేర్కొన్నారు. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. త్వరలోనే పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు త్వరలోనే పిసిసి కమిటీల ప్రకటన ఉంటుందన్నారు. అయితే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయంలో అధిష్టానానికి తమకు వచ్చిన వినతుల గురించి వివరించామని పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో బిసిలకు ప్రాతినిథ్యం ఉండాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాల గురించి కెసి వేణుగోపాల్ పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారని, త్వరలోనే పిసిసి కార్యవర్గ ప్రకటన ఉంటుందని మహేష్ గౌడ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News