Thursday, May 29, 2025

చెయ్యి వదిలి కారెక్కనున్న కోనప్ప?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ మాజీ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప కాంగ్రెస్ వదిలి కారు ఎక్కుతారాన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2009లో ఒకసారి కాంగ్రెస్ నుండి, రెండవసారి బిఎస్‌పి నుండి, మూడవసారి బిఆర్‌ఎస్ నుండి ఎంఎల్‌ఎగా ఆయన గెలుపొందారు. గత ఎన్నికల్లో భాజపా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు చేతిలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒడిపోయిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరడంతో వెంటనే కోనప్ప బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో గత సంవత్సరం కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు.అనంతరం పార్టీలో చురుకుగా పాల్గ్గొంటూ వచ్చారు. తొమ్మిది నెలల క్రితం ఎంఎల్‌సి దండే విఠల్ కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గం బాధ్యతలను తీసుకోవడంతో అప్పటినుండి కోనప్ప పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నాలుగు నెలల క్రితం అధిష్టానం అతనిని పిలిపించుకొని పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని చెప్పినా వినకుండా పార్టీకి దూరంగా ఉంటున్నారు..

ఎంఎల్‌సి దండే విఠల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు తనను పిలవడం లేదంటూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని, పలు మార్లు ముఖ్యమంత్రికి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయమని కోరినా పట్టించుకోవడం లేదని తమ సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు ఏమీ లేవని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మాజీ సిఎం కెసిఆర్ దేవుడని, ఆయన తన నియోజకవర్గానికి ఎంతో చేశారని పొగిడారు. కాంగ్రెస్‌లో ఇక ఉండలేనని, ఏ పార్టీలో చేరిన తన జన్మలో మాత్రం మళ్లీ ఆ పార్టీలో చేరనని పలు సమావేశాల్లో స్పష్టం చేశారు. ఈ అంశాల ఆధారంగా కోనప్ప కాంగ్రెస్ వీడి మళ్లీ బిర్‌ఎస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News