న్యూఢిల్లీ: ప్రదాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి సోమవారం (11మే 26)తో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ 11 ఏండ్లు దేశ ప్రగతి పథంలో మైలురాళ్లు అని , ఆయన ఇన్నేళ్ల పాలనలో విరామం తెలియక చేపట్టిన పలు కార్యక్రమాలు , క్షేత్రస్థాయి చర్యలు జాతి ఆత్మస్థయిర్యాన్ని పెంపొందింపచేశాయని బిజెపి తరఫున అధికారిక ప్రకటన వెలువరించారు. సరిగ్గా ఇదే రోజున 2014లో మోడీ దేశ ప్రధానిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత రెండు విజయాలను ఆయన ఆధ్వర్యంలో బిజెపి మిత్రపక్షాలతో కలిసి సాధించింది. ఘనమైన పనులు, మహత్తర సంవిధానాలు, వ్యూహాత్మక చర్యలు ఈ త్రిస్థాయి విజయం మోడీని త్రివిక్రముడిని చేశాయని బిజెపి వర్గాలు స్పందించాయి. గత ఏడాది జూన్ 9న ఆయన మూడోసారి పిఎంగా ప్రజల ముందుకు వచ్చారు.
వరుసగా మూడు విజయాలు సాధించడం వెనుక మోడీ విశేష కృషి , ప్రజల సేవలో ఆయన ముందుకు వెళ్లడం ఇందుకు తగ్గట్లుగానే జనం ఆదరించారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సామాజిక మాధ్యమంలో స్పందించారు. దేశ ప్రజల కోసం పనిచేస్తే ప్రజల కోసం ఫలితం ఆశిస్తే , దీనికి అనుగుణంగానే ప్రజా ప్రతిస్పందన కూడా ఉంటుందని స్పష్టం అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాధించిన విజయాలకు, తీసుకున్న తీసుకుంటున్న చొరవకు ప్రధాని మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అని తెలిపారు. ప్రధానిగా మోడీ నేటికి 11 సంవత్సరాల పాలన ముగించుకున్నారనేది పార్టీకి గర్వకారణం అని పాత్ర పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జువల్ ఓరామ్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ నరేంద్ర మోడీజి సారధ్యంలో దేశ అత్యంత పరివర్తిత భారత్ దశకు చేరిందని తెలిపారు. మే 26న ప్రధాని మోడీ ప్రధాని కావడం దేశాన్ని మలుపు తిప్పిన రోజు అని కేంద్ర మంత్రి కొనియాడారు.