డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్టిపూర్తి’. (Shashtipurthi) ఈ మూవీలో ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో దర్శకుడు పవన్ ప్రభ మీడియాతో మాట్లాడుతూ “ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవుతున్నారు. నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని తీశాను. ఇప్పటి వరకు ‘షష్టిపూర్తి’ గురించి చూసిన దాని కంటే మే 30వ తేదీని మీరు సర్ ప్రైజ్ అయ్యే అంశాలెన్నో సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో ఓ స్ట్రిక్ట్ మదర్ ఎలా ఉంటారో అలానే అర్చనను చూపించాను. ఓ జోవియల్ ఫాదర్ ఎలా ఉండాలో అలా రాజేంద్ర ప్రసాద్ని చూపించాను. ‘షష్టిపూర్తి’ ట్రైలర్ను అందరూ మెచ్చుకున్నారు.
సినిమాలో ఏదో విషయం ఉందని అంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో కొంత వింటేజ్ పార్ట్ కూడా ఉంటుంది. ‘షష్టిపూర్తి’ లాంటి ఎమోషనల్ డ్రామాకి, తల్లిదండ్రుల సెంటిమెంట్ మీద రాసుకున్న కథకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యం. అందుకే నేను ఈ చిత్రానికి ఇళయరాజా కావాలని అనుకున్నాను. ఈ కథ మొత్తాన్ని గోదావరి ప్రాంతంలోనే తీశాను. ఈ కథను ముందుగా రూపేశ్కి చెప్పాను. ముందుగా ఆయనకు సినిమాను నిర్మించే ఆలోచన లేదు. కానీ ఈ కథను విన్నాక మొత్తం తన భుజాన వేసుకున్నారు. ఇళయరాజా ప్రతి పాటకు మాకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. అన్ని పాటల్ని క్షణాల్లో కంపోజ్ చేసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్, రెహమాన్, కీరవాణి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేశ్ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ‘షష్టిపూర్తి’ అనేది పూర్తిగా కల్పిత చిత్రమే. ఇందులో ఉండే పాత్రల్లా బయట బతకలేరు. రాజేంద్ర ప్రసాద్ పోషించిన పాత్ర బయట కనిపించదు. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మా ‘షష్టిపూర్తి’ రాబోతోంది”అని అన్నారు.