దాదాపు 2 శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలకులు ‘కూలీ’ అనే పదాన్నీ, పని విధానాన్నీ భారతదేశంలో ప్రవేశపెట్టారని భావించాలి. 1830వ దశకంలో అసోం ప్రాంతంలో తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు వంటి పంటలను సాగు చేయడానికి పేదవాళ్ళను అక్కడికి తీసుకెళ్లి లాభసాటిరీతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అది కాంట్రాక్టు పని విధానం కనుక, అక్కడ పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా మధ్యలో వెళ్లిపోయే అవకాశం లేదు. అలాంటి పనివాళ్లను ‘కూలీలు’ అని పిలవడం మొదలైంది. దేశంలో ఉన్న సామాజిక పరిస్థితుల కారణంగా ఇది కొన్ని దశాబ్దాలు సాగి, బ్రిటీష్ వారికి అమితమైన సంపదనిచ్చింది. బ్రహ్మసమాజపు సభ్యుడైన రామ్ కుమార్ విద్యారత్న ఈ రీతిలో చిక్కుకొని ఇడుములపాలైన వారి పరిస్థితి గమనించి తొలుత బయట ప్రపంచానికి తెలిపారు. ఈ ఫస్ట్ హ్యాండ్ ఫీల్ విషయాలు గమనించిన ద్వారకనాథ్ గంగూలీ(1844-1898) బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇబ్బందులు ఉంటాయని గమనించినా, అక్కడికి వెళ్లి అధ్యయనం చేయడానికి నిర్ణయించుకున్నాడు.
అతికష్టం మీద కలకత్తా నుంచి ఆ లాభసాటి పంటల ఎస్టేట్‌ను చేరుకున్నాడు. అక్కడ బ్రిటిష్ మేనేజర్లు పలు రకాల సౌఖ్యాలతో జీవితం గడుపుతూ, ఎన్నో లాభాలు పొందుతుండగా; ఈ కూలీలు మాత్రం చాలా అధ్వానమైన రీతిలో కడగండ్ల పాలవుతూ ఉండటం తన కళ్ళారా గమనించాడు. ధర్మాగ్రహంతో రగిలిపోయిన ద్వారకానాథ్ గంగూలీ వరుసగా కె.కె.మిత్రా నడిపే ‘సంజీబాని’, ఇంకా సురేంద్రనాథ్ బెనర్జీ నడిపే ‘బెంగాలీ’ పత్రికల్లో బానిసల్లా జీవితాన్ని గడుపుతున్న భారతీయ కూలీల గురించి వివరంగా రాశారు. అంతేకాదు బిపిన్ చంద్రపాల్ ద్వారా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో కూడా ఈ విషయం చర్చించేలా చేశాడు. అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తూ, బ్రిటిష్ ఎస్టేట్ మేనేజర్లు ఎలా నలుగురు కూలీలు చనిపోయేలా చేశారో వివరాలతో ఏకరువుపెట్టాడు. ఈ చర్యలు బ్రిటిష్ ప్రభుత్వానికి కంటగింపుగా మారుతుండగా, మరోవైపున నేషనల్ కాంగ్రెస్ బృందాలు అసోంకు వెళ్లి మరిన్ని వివరాలు పంపడం మొదలైంది. దాంతో 19వ శతాబ్దం మొదట్లో ఈ కూలీల సమస్య బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద అవరోధంగా మారి, ఒక కీలకమైన పోరాట అంశంగా మారింది.
చివరకు 1920లో ఈ దుష్ట చట్టాన్ని బ్రిటీష్ వారు రద్దు చేయాల్సి వచ్చింది. అప్పటికి ద్వారకనాథ్ గంగూలీ కనుమూసినా ఈ విజయం చిన్నది కాదు! బెంగాలీల పనితనం, త్యాగం, కీర్తి గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసని మనం భావిస్తూ ఉంటాం. నిజానికి ద్వారకనాథ్ గంగూలీ గురించి బెంగాల్లో కూడా పెద్దగా తెలియదు. ఏదైనా కొద్దిగా సమాచారం ఉందంటే అది కాదంబినీ గంగూలిని ప్రోత్సహించి దేశంలో తొలి మహిళా డాక్టర్ అయ్యేలా చేసిన భర్తగా మాత్రమే. అసోం కూలీల కష్టాలు వెలికితీసి వారి కష్టాలను గట్టెక్కించిన యోధుడిగా మాత్రమే కాకుండా మరింత ఖ్యాతి కలిగించే విషయం కూడా ఉంది. అప్పట్లో కులీన బ్రాహ్మణులు మూడు కులాలకు చెందిన మహిళలను అదనంగా పెళ్ళాడి, వారి తల్లిదండ్రులు ఇచ్చే కానుకలతో జీవితం గడిపేవారు. ద్వారకానాథ్ గంగూలీ మీద చిన్న వయసులోనే అక్షయ్ కుమార్ దత్త ‘ధర్మనీతి’ పుస్తక ప్రభావం చాలా ఉంది. మహిళా చైతన్యాన్ని ప్రోది చేసే ఈ రచన కారణంగా బహుభార్యత్వం, బాల్యవివాహాలు గురించి ఏహ్యభావం; అలాగే కులాంతర వివాహాలు, వితంతు వివాహాల గురించి గౌరవం పెరిగింది.
తమ బంధువులలో కట్నకానుకలకు ఆశపడి, భార్యలకు విషం ఇచ్చి చంపిన దృష్టాంతాలు 17 సంవత్సరాల వయసులో ద్వారకనాథ్ దృష్టికి వచ్చాయి. దాంతో బహు భార్యత్వాన్ని నిరసిస్తూ తను అటువంటి పని చేయనని నిర్ణయానికి వచ్చారు. ద్వారకనాథ్ గంగూలీ తొలి వివాహం ద్వారా కలిగిన బిదుముఖి మునిమనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే. ఇద్దరు పిల్లలు తర్వాత భార్య గతించడంతో 1883లో కాదంబినీ బసును ద్వారకనాథ్ వివాహం చేసుకున్నారు. భారతదేశంలోని తొలిసారి పట్టభద్రులైన ఇద్దరు మహిళలలో కాదంబిని ఒకరు. మహిళలకు కలకత్తా వైద్య కళాశాలలో ప్రవేశంకోసం కోర్టులో పోరాడి విజయం సాధించాడు ద్వారకనాథ్. కాదంబినీ గంగూలీ భారతదేశంలో చదివి వైద్యపట్టా పొందిన తొలి మహిళ మాత్రమే కాదు, తర్వాత దశలో ప్రాక్టీస్ చేసిన తొలి డాక్టర్ కూడా. పై చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కాదంబినీ గంగూలీ రాజకీయాలలో, సంఘ సేవలో పాల్గొన్నప్పుడు నీచమైన విమర్శలు చేసిన మహేష్ పాల్ అనే పత్రిక సంపాదకుడికి జైలుశిక్షపడేలా పోరాడిన మహిళల యోధుడు ద్వారకనాథ్.
కాదంబిని ద్వారా కలిగిన ఐదుమంది సంతానంలో కుమార్తె జ్యోతిర్మయి, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన మణిపూస. కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా పేరుగాంచారు. బ్రహ్మసమాజంలోని ఒక విభాగమైన సాధారణ బ్రహ్మసమాజంలో పని చేసిన ద్వారకనాథ్ మహిళలకు ఉన్నత చదువులు కావాలని, అందులో సైన్స్, మేథమేటిక్స్, ఇంకా సంగీతం ఉండాలని వాదించిన వ్యక్తి. ఇది మరో పెద్ద బ్రహ్మసమాజపు నాయకులు, కేశవ్ చంద్రసేన్ వాదానికి పూర్తి విభిన్నం. హిందూ మహిళా విద్యాలయ హెడ్‌మాస్టర్‌గా పని చేసిన కాలంలో తీర్చిదిద్దిన చంద్రముఖి, కాదంబినీ, సరళ, అబలా బోస్, ఇందుమతి, బిదుముఖి, హరసుందరి తర్వాత కాలంలో గొప్పచరిత్ర సృష్టించారు.
న్యాయబద్ధమైన రాజకీయ, మేధో, పదార్థిక ప్రగతి సాధనకోసం సురేంద్రనాథ్ బెనర్జి, ఆనందమోహన బోస్‌తో కలసి 1876లో దేశంలో తొలి జాతీయవాద సంస్థ ‘ఇండియన్ అసోసియేషన్’ ను స్థాపించారు. ఈ సంస్థకు సహ సంచాలక బాధ్యతలు నిర్వహించారు. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన సమయంలో ఈ సంస్థను అందులో విలీనం చేసి రాజకీయాలలో మహిళల ప్రవేశం గురించి దృష్టిపెట్టారు. బిపిన్ చంద్రపాల్ 1907 మార్చి 14న మహిళలకోసం స్వదేశీ ఉద్యమ సమావేశం నిర్వహించినపుడు ద్వారకనాథ్ రాసిన పాటను విశేషమైన రీతిలో గానం చేశారు. కేవలం 54 సం మాత్రమే జీవించిన 1898 జూన్ 27న కనుమూసినా ద్వారకనాథ్ గంగూలీ తొలి తరం కార్మిక, మహిళా నాయకుడిగా; సంస్కరణశీలిగా, విద్యావేత్తగా, జాతీయవాదిగా, జర్నలిస్టు దీపికగా వెలిగిన మహోన్నతమూర్తిగా చిరస్మరణీయులు.
-డా. నాగసూరి
వేణుగోపాల్
94407 32392