Thursday, May 29, 2025

ముందే రగిలిన ఎన్నికల వేడి

- Advertisement -
- Advertisement -

బీహార్ 18వ శాసనసభకు వచ్చే అక్టోబర్ -నవంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమై అప్పుడే రణభేరి మ్రోగించాయి. భారత్‌లో 13.1 కోట్ల జనాభాతో రెండో పెద్ద రాష్ట్రంగా ఉన్న బీహార్‌లో సామాజిక న్యాయం, కులాల ప్రభావం అధికం. ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి దాడులు జరిపిన తర్వాత నేరుగా బీహార్‌కు వచ్చి మధుబని బహిరంగసభలో ప్రసంగించారు. మళ్ళీ ఈ నెల 29-, 30వ తేదీలలో బీహార్‌లో పర్యటించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీనిని శాసనసభ ఎన్నికలకు ప్రధాని మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న సంగతి స్పష్టమవుతోంది. ఆర్‌జెడి అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సంప్రదాయంగా మద్దతు ఇచ్చే యాదవ, ముస్లిం వర్గాలనేగాక మహిళలు, వ్యాపారులు, అత్యంత వెనుకబడిన వర్గాలను మహా కూటమి వైపు ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల పాట్నాలో ఆర్‌జెడి ఇబిసి విభాగం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనలో అత్యంత వెనుకబడిన కులాల వారెవరూ బాగుపడలేదని, బాగుపపడింది కుటుంబమేనని నిప్పులు చెరిగారు. ఇబిసిలు బాగుపడాలి అంటే మహాకూటమిని అధికారంలోకి తెచ్చి తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వక్తలు పిలుపు ఇచ్చా రు. ఇబిసిలకు భద్రత, గౌరవం, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నేరాల నుండి, నేరస్థుల నుండి రక్షణ కల్పిస్తామని, అవమా నించిన వారిని కఠినంగా శిక్షిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ ఆటవిక పాలన సాగించారని, శాంతి భద్రతలు లేవనే విమర్శలను తిప్పికొడుతూ సామాజిక న్యాయం జరిగింది ఆర్‌జెడి పాలనలోనేనని తేజస్వి గుర్తుచేశారు. ఆర్‌జెడికి దూరంగా ఉన్న అగ్రవర్ణాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఏప్రిల్ నెలాఖరున పాట్నాలో వైశ్యుల భారీ ర్యాలీ నిర్వహించారు.

16వ శతాబ్దినాటి వైశ్య ప్రముఖనేత భామాషా జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి తేజస్వి వైశ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వైశ్యులు ఎంతో పరిశ్రమించి ఎన్నో సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బీహార్ పురోభివృద్ధికి తోడ్పడుతున్నారని తేజస్వి కొనియాడారు. 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు తాను బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రూ. 50 వేల కోట్ల కొత్త పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని తేజస్వి గుర్తు చేశారు. 2020 శాసన సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడినా బిసిలు అధికంగా ఉన్న 15 స్థానాలను ఆర్‌జెడి కోల్పోయింది.

అందుకే సంప్రదాయ ఓటర్లు గాక ఇతర సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకుంటేనే విజయం సాధ్యమనే వాస్తవాన్ని గుర్తించి తేజస్వి ఇబిసిలు, అగ్రవర్ణాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆర్‌జెడికి ఓటు బ్యాంకుగా ఉన్న యాదవ ముస్లిం వర్గాల్లో అసంతృప్తి రేగుతుందేమో ననే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదీగాక తేజస్వి మొదట మహాకూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ తదితర పార్టీల మధ్య ఈ అంశాలపైనేగాక సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. బీహార్‌లో అంత బలం లేని కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి 70 స్థానాలు తీసుకుని వాటిలో కేవలం 19 స్థానాల్లో గెలుపొందిన ది. కాగా సిపిఎంఎల్ పార్టీ 19 స్థానాల్లో పోటీచేసి 12 స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఒకప్పుడు బీహార్‌లో గణనీయంగా బలం కలిగిన సిపిఐ ప్రాభవం కోల్పోయినా 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, ఒక స్వతంత్రుడు గెలిచారు.

గత ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమిలో ఉండి 13 స్థానాలకు పోటీ చేసిన వికాస్ శీలు ఇన్ సాన పార్టీ ఈసారి మహా కూటమిలో చేరినందున ఆ పార్టీకి నాలుగైదు స్థానాలు అయినా ఇవ్వక తప్పదు. కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలను 50కి తగ్గించు కోవాలని ఒప్పించడం తేజస్వికి సవాలే. 2020 ఎన్నికలలో బిజెపి, జెడియు పార్టీలు ఎన్‌డిఎగా పోటీ చేసి 125 స్థానాలు గెలిచి మళ్ళీ నితీష్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహా కూటమి 110 స్థానాలు గెలవగా అందులో 144 స్థానాలకు పోటీ చేసిన ఆర్‌జెడి 75 స్థానాలు గెలిచి తేజస్వి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎన్‌డిఎకు 37.26 శాతం ఓట్లు రాగా, మహా కూటమికి 37.23 శాతం ఓటు అంటే కేవలం 0.3 మాత్రమే తక్కువగా వచ్చాయి. బిజెపికి 19.46 శాతం, మజ్లిస్ పార్టీ ఉత్తర బీహార్ ‘సీమాంచల్ ప్రాంతంలో పోటీ చేసి 5 స్థానాలు గెలిచి మహా కూటమిని దెబ్బతీసి ఎన్‌డిఎ గెలిచేలా చేసింది చిరాగ్ పా స్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ సొంతంగా 54 స్థానాల్లో బరిలోకి దిగి 25 స్థానాల్లో జెడియు గెలుపును దెబ్బ తీసింది.

జెడియును తగ్గించడానికి ఇది కమలనాథులు పన్నిన కుతంత్రం అనే విమర్శలు గమనార్హం. అందుకే జెడియు స్థానాలు 43కు తగ్గాయి. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న నితీశ్ కుమారుడు నిశాంత్ ఇప్పుడు తన తండ్రికి ముఖ్యమంత్రిగా మరో అవకాశం ఇవ్వాలని మోడీని కోరుతున్నారు. ఈసారి గెలిస్తే బిజెపికే ముఖ్యమంత్రి పదవి అని కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నితీశ్ కుమార్‌కు కేంద్రంలో పదవి ఇచ్చి బిజెపి నేతకు సిఎం పదవి ఇస్తారని అంటున్నారు. అది నిజం కాకపోతే 35 యేళ్ళ తేజస్వి కి, 73 యేళ్ల నితీశ్ కు పోటీ జరిగితే బీహార్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.

బీహార్ సామాజిక స్వరూ పాన్ని పరిశీలిస్తే అగ్రవర్ణాలు 16 శాతం కాగా, బిసిలు 27 శాతం, అత్యంత వెనుకబడిన తరగతుల వారు 36 శాతం, దళితులు దాదాపు 20 శాతం, ముస్లింలు 17 శాతం, యాదవ్‌లు 14 శాతం ఉన్నారు. బీహార్‌లో నెలకు 6 వేల కంటే ఆదాయం గలవారు 34 శాతం ఉన్నారు. చంద్రగుప్తుడు, అశోకుడు యేలిన మౌర్యసామ్రాజ్య వైభవం, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి మహాత్ములు జన్మించిన పుణ్యభూమి, ఒకప్పుడు నలందా వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు యెంతో వైభవంగా విల‘సిల్లిన’ చారిత్రక భూమి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లు గడిచినా ఇంకా వెనుకబడి ఉండటం విచారకరం. అపార మానవ వనరుల వినియోగానికి కులమత ,ప్రాంతీయ ధోరణులు లేకుండా అభివృద్ధే ఏకోన్ముఖంగా. నడిపే దక్షత గల నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం.

-పతకమూరు దామోదర్ ప్రసాద్, 94409 90381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News