Thursday, May 29, 2025

సంక్షోభంలో బంగ్లా ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో పెను రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి పాలయ్యారు. అవామీ లీగ్ ఆధ్వర్యంలో 16 ఏళ్ల హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో సాగింది. అయితే నిరంకుశత్వం, ఎన్నికల్లో మోసాలు, అసమ్మతిపై ఉక్కుపాదం వంటి ఆరోపణలతో ఆమె ప్రజాగ్రహానికి లోనయ్యారు. అసంతృప్తితో చెలరేగిన విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలు హసీనాను భారతదేశానికి పారిపోయేలా చేశాయి. దీంతో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నియమించబడింది. ఆయన లక్ష్యం ప్రజాస్వామ్య సంస్కరణల అమలు, రాజకీయ స్థిరత్వం సాధించడం, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను దేశాన్ని సిద్ధం చేయడం. అయితే యూనస్ పగ్గాలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే ఆయన నాయకత్వం విమర్శల పాలైంది. సంక్షోభంలో ఉన్న దేశాన్ని చక్కదిద్దడానికి బదులు విభజనలను మరింత పెంచారని విమర్శకులు వాదిస్తున్నారు.

గతంలో చెలరేగిన హింసాకాండలో అవామీలీగ్ పాత్రపై విచారించడం, 2024 తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలను రక్షించాల్సి ఉందన్న సాకుతో సవరించిన టెర్రరిస్ట్ నిరోధక చట్టం కింద అవామీలీగ్‌ను నిషేధించాలని 2025 మే 10న తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతి పెద్ద తప్పిదం.అవామీలీగ్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర వహించింది. 40% ఓట్ల వాటా కలిగిన అవామీలీగ్‌కు బంగ్లాదేశ్ ప్రజలలో గణనీయమైన మద్దతు ఉంది. చట్టబద్ధమైన ప్రక్రియ గానీ, పారదర్శకత గానీ లేకుండా అమలు చేసిన నిషేధం జనాభాలో మెజారిటీకి ఆగ్రహం కలిగించింది. భారతదేశంతో సహా అంతర్జాతీయ దేశాలు అవామీలీగ్‌పై నిషేధాన్ని ఖండించాయి. స్పష్టమైన ఎన్నికల అవసరాన్ని ఆ దేశాలు నొక్కి చెప్పాయి. యూనస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్వేచ్ఛలను దెబ్బతీస్తోందని హ్యుమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. అలాంటి చర్యల కారణంగా హసీనా పాలనలో జరిగిన అణచివేత పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్- జమాన్‌తో యూనస్‌కు గల సంబంధాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. షేక్ హసీనా పదవీచ్యుతి, యూనస్ నియామకంలో కీలక పాత్ర వహించిన ఆర్మీ చీఫ్ జమాన్ 2025 డిసెంబర్ నాటికి కొత్తగా ఎన్నికలు జరిగి తీరాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు.

మానవతా సహాయం కోసం మయన్మార్‌కు యూనస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రఖైన్ కారిడార్ వంటి కీలక నిర్ణయాలను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేట్రేగిపోతున్న ఇస్లామిక్ టెర్రరిజం నియంత్రణలో యూనస్ ధోరణి, జాతీయ భద్రత విషయంలో ఆయన అనుసరిస్తున్న ఉదాసీన విధానాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల సైన్యం ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకునే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తోటి ప్రభుత్వ సలహాదారులతో యూనస్ ఈ విషయాలు చెప్పినప్పుడు ఆయనలో నిరాశ, నిసృ్పహలు స్పష్టంగా కన్పించాయి. సరిగా పనిచేయలేకపోతే, ప్రధాన సలహాదారుగా ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. అల్లకల్లోలంగా ఉన్న రాజకీయ చిత్రాన్ని చక్కదిద్దేందుకు ఆయన చేసిన కృషిని ప్రశ్నించే ప్రకటన అది. ఉన్న సమస్యలు చాలవన్నట్లు అగ్నికి ఆజ్యం పోస్తూ, భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని ముఖ్యంగా సిలిగురి కారిడార్ ను కోడిమెడగా పేర్కొకొంటూ యూనస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశంతో దౌత్య వివాదానికి దారి తీసింది.

భారతదేశం ప్రధాన భూభాగాన్ని ఈశాన్యంలోని రాష్ట్రాలతో కలిపే ఇరుకైన ప్రదేశం భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో సున్నితమైనది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, రఖైన్ కారిడార్‌కు సంబంధించిన చర్చల నేపథ్యంలో యూసన్ చేసిన ఈ వ్యాఖ్య భారతదేశాన్ని రెచ్చగొట్టినట్లయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్య వెలుగులోకి వచ్చింది. అవామీలీగ్‌పై నిషేధం, బంగ్లాదేశ్‌లో బహిష్కరణకు గురైన హసీనా, భారతదేశంలో తలదాచుకోవడంతో ఇప్పటికే తీవ్రస్థాయిలో భారత బంగ్లాదేశ్ సంబంధాలు ఈ వ్యాఖ్యతో మరింత బెడిసికొట్టాయి. తన వ్యాఖ్యలు బెడిసికొట్టడంతో యూనస్ ఓ వివరణ జారీ చేస్తూ, తన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని కించపరచే ఆలోచన లేదని, ప్రాంతీయ కనెక్టివిటీలో ఎదురైన సవాళ్లను ఎత్తిచూపేందుకు చేసిన వ్యాఖ్యలని వివరణ ఇచ్చారు.

బంగ్లాదేశ్ బలమైన ద్వైపాక్షిక సంబంధాలే కోరుతోందన్నారు. ఏదిఏమైనా అపార్థాలు తలెత్తినందుకు తాను చింతిస్తున్నారని యూసన్ తెలిపారు. అయితే యూనస్ భారత వ్యతిరేక భావజాలంతో ఉన్నారని, బహుశా పాకిస్తాన్, చైనా ప్రభావంతో ఆయన మాట్లాడుతున్నారని భారత అధికారులు, మీడియా ఆరోపించడంతో పెద్ద నష్టమే జరిగింది. బంగ్లాదేశ్‌కు కీలక ప్రాంతీయ భాగస్వామిగా భారత దేశం పాత్ర, ఆర్మీ జనరల్ జమాన్ పాక్ అనుకూల వైఖరి నేపథ్యంలో తలెత్తుతున్న ఆందోళనల దృష్ట్యా ఇది హానికరమైన పరిమాణమే. కోడి మెడ వ్యాఖ్య యూనస్ అనుభవరాహిత్యాన్ని నొక్కి చెబుతోంది. పాకిస్తాన్, చైనా వైపు ఆయన మొగ్గు చూపడం, అవామీలీగ్ పై నిషేధం వంటి పరిణామాల వల్ల ఉభయదేశాల సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఈ దౌత్యపరమైన తప్పుడు చర్యను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీలకు ఆగ్రహం కలిగించాయి.యూనస్‌కు దేశాన్ని సరైన ధోరణిలో నడిపే వ్యూహాత్మక దూరదృష్టి లేదని వారు ఆరోపిస్తున్నారు. షేక్ హసీనాపై యూనస్‌కు గల ప్రతీకార భావనే ఆయన తప్పిదాలకు దారితీస్తోందని అంటున్నారు.

హసీనా హయాంలో ఆయన మైక్రో ఫైనాన్స్‌కు సంబంధించి పథకాలకు న్యాయపరమైన అడ్డంకులు, వేధింపులు ఎదురయ్యాయి. ఆయన పాలనపై ఈ వ్యక్తిగత ఇబ్బందుల ప్రభావం కూడా పనిచేసి ఉంటుందని భావిస్తున్నారు. ఉదాహరణకు అవామీలీగ్‌ను నిషేధించాలన్న నిర్ణయం దేశంలో రాజకీయ సుస్థిరకు చేపట్టిన చర్యగా కాక, ప్రతీకార చర్యగా చాలా మంది చూస్తున్నారు. ఇది ఓటర్లలో చాలా మందిని దూరం చేసింది. యూనస్ తటస్థ మధ్యవర్తి అన్న ప్రతిష్ఠను దెబ్బతీసింది. బంగ్లాదేశ్‌లో అవామీలీగ్, బిఎన్‌పి పార్టీల మధ్య రాజకీయ అంతరాలు ఎక్కువ. సగం మంది అటు, మరికొందరుఇటు నిలిచారు. ఈ రెండు పార్టీల మధ్య చర్చలు ప్రోత్సహించి, రాజకీయ ప్రతిష్టంభన తొలగించడంలో యూనిస్ విఫలమయ్యారు. ఇక బంగ్లాదేశ్‌లోని ఎన్‌సిపి, బిఎన్‌పి పార్టీల మధ్య సంబంధాలు ఉప్పూ, నిప్పు అన్నట్లు ఉన్నాయి.

ఎన్‌సిపీతో సంబంధాలు ఉన్న కేబినెట్ సభ్యులను తొలగించాలని బిఎన్‌పి డిమాండ్ చేయగా, దేశంలో సుస్థిర రాజకీయ వాతావరణం నెలకొనేవరకూ మరికొంతకాలం యూనస్ అధికారంలో కొనసాగాలని ఎన్‌సిపి కోరుతోంది. రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించలేక యూనస్ ఒంటరి అయ్యాడు. తన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. సైన్యం లో పెరుగుతున్న ఆకాంక్షలు ప్రస్తుతం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ జమాన్ త్వరలో ఎన్నికలకోసం బహిరంగంగా డిమాండ్ యూనస్ నాయకత్వం జమాన్ ఆందోళలను, అధికారపరమైన పోరాటాలను చూపిస్తున్నాయి. గతంలో తిరుగుబాట్లు, బంగ్లాదేశ్ రాజకీయాల్లో సైన్యం వహించిన పాత్ర తెలిసిందే. ఒకవేళ సంక్షోభం కొనసాగితే, సైన్యం జోక్యం చేసుకుంటుందేమోనన్న భయాన్ని పెంచుతున్నాయి.

అవామీలీగ్‌పై నిషేధం సమగ్ర పాలనకు ఓ అడ్డంకిగా ఉంది. గతంలో తప్పిదాలకు న్యాయపరమైన జవాబుదారీని చేస్తూ, ఆ నిషేధాన్ని మార్చుకున్న పక్షంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కట్టుబడి ఉందనే భావన కల్గిస్తుంది. అంతేకాక, అశాంతి కూడా తగ్గుతుంది. స్పష్టమైన రాజకీయ ప్రక్రియ చేపట్టి, ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలను జరిపించేందుకు ఇది ఎంతో అవసరం. ఒకపక్క సైన్యం, మరో పక్క రాజకీయ పార్టీలు కోరుతున్నట్లు గా 2025 డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు యూనస్ ఎన్నికల సంఘంతో కల్సి పని చేయాలి. అంతర్జాతీయ పర్యవేక్షణ ద్వారా ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేటట్లు చూడాలి. అప్పుడే ప్రజలలో విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది. యూనస్ తక్షణ కర్తవ్యం బిఎన్‌పి, ఎన్‌సిపి, అవామీలీగ్ పార్టీల ప్రతినిధులతో జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు, తటస్థ సంస్థల పర్యవేక్షణలో ఎన్నికల సంస్కరణలను ప్రతిపాదిస్తే, జాతీయ ప్రాధాన్యతలపై ఏకాభిప్రాయానికి దోహదపడగలదు.

సైనిక తిరుగుబాటు తప్పించేందుకు యూనస్, జనరల్ జమాన్, ఇతర మిలిటరీ నాయకులతో కలిసి పనిచేయాలి. జాతీయ భద్రత, రఖైన్ కారిడార్‌లపై ఉన్న ఆందోళనలను తొలగించాలి. దేశంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పారద్శకత, సహకారం చాలా అవసరం. బంగ్లాదేశ్ పరిస్థితి ప్రస్తుతం క్రాస్‌రోడ్ లలో ఉన్నట్లు ఉంది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఒకపక్క, రాజకీయ అనిశ్చితి, సైనికపరమైన ఉద్రిక్తతలు, దౌత్యపరమైన తప్పుడు చర్యలతో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. అవామీ లీగ్ నిషేధం, కోడి మెడ వ్యాఖ్యతో సహా ఆయన వివాదాస్పద నిర్ణయాలు ఆయన చట్టబద్ధతను దెబ్బతీశాయి. అటు భారతదేశంతో, ఇటు సైన్యంతో సంబంధాలూ దెబ్బతిన్నాయి. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ వల్ల కొంత నష్ట వియంత్రణ జరిగినా, రాజకీయ సుస్థిరత పునరుద్ధరణకు విస్తృత ప్రయత్నాలు అవసరం. ఇందుకోసం ఆచరణాత్మక నాయకత్వం, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యపరమైన భవిష్యత్‌ను గ్యారంటీ ఇచ్చేందుకు సమగ్రతతో కూడిన నిబద్ధత ఎంతైనా అవసరం.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News