విదేశీ ఉద్యోగాల పేరున మోసాలు ఎన్నో సాగుతున్నాయి. ఈ ఉచ్చులోపడి వేలాది మంది విదేశాల్లో చిక్కుకుని నానాఅవస్థలు పడుతున్నారు. అక్కడ హింసలను భరించి వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఇటువంటి సైబర్ బానిసత్వంలో బాధితులైన వారిని కేంద్ర ప్రభుత్వం రక్షించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. అయినాసరే చాపకింద నీరులా ఈ సైబర్ బానిసత్వ రాకెట్ అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్ వంటి దేశాల్లో సాగుతుండడం విశేషం. బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగం వస్తుందని, ప్రతినెలా లక్ష రూపాయలు వస్తాయని ఏజెంట్లు ఆశ చూపించడంతో తెలంగాణకు చెందిన కొంతమంది యువకులు దగాపడ్డారు. మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్‌లో బందీలుగామారి బలవంతంగా సైబర్ వెట్టి చాకిరీకి గురవుతున్న 2000 మందికి ఇటీవల కేంద్రం చొరవతో విముక్తి లభించడం విశేషం.
బాధితుల కథనం ప్రకారం ఏజెంట్లు ముంబై మీదుగా బ్యాంకాక్‌కు విమానంలో తరలించారు. అక్కడ నుంచి పొరుగుదేశాలకు అక్రమ రవాణా చేశారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలను లక్షంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు సాగించేలా వీరికి శిక్షణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ శిక్షణకోసం భారతీయులను లావోస్‌కు పంపిన దాఖలాలు కూడా బయటపడ్డాయి. అంతర్జాతీయ సైబర్ బానిసత్వ రాకెట్‌లో ఇద్దరు ప్రధాన నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేయగలిగింది. ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరు గుజరాత్‌కు చెందిన హితేష్ అర్జన సౌమ్య కాగా, మరొకరు హైదారాబాద్‌కు చెందిన కొలనాటి నాగశివ అలియాస్ జేమ్స్. కొలనాటి నాగశివ అలియాస్ జేమ్స్‌ను మే 19న కొల్‌కతాలోని నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. లుక్ అవుట్ నోటీస్ ప్రకారం లావోస్ నుండి వచ్చిన తరువాత అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హితేష్ అర్జన సౌమ్యను ఢిల్లీలో అరెస్టు చేయగలిగారు.
హోం మంత్రిత్వశాఖ సమన్వయంతో సైబర్ బానిసత్వానికి గురైన అనేక మంది బాధితులతో అతను ఇటీవల మయన్మార్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కంబోడియా, మయన్మార్, లావోస్‌ల్లోని అక్రమ సైబర్ కాల్ సెంటర్ల నుంచి రక్షించబడిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. బాధితుల్లో కొందరిని థాయ్‌లాండ్‌లో ఒక్కొక్కరని 5000 డాలర్లకు అమ్మేయడం కూడా జరిగింది. తెలంగాణకులోని కొహెడ్‌కు చెందిన బాధితుడు తన అనుభవం చెబుతూ బ్యాంకాక్‌కు 200 కి.మీ దూరంలో మంచి జాబ్ ఉందని ఏజెంట్ నమ్మించాడని, తీరా అక్కడకు వెళ్లాక రోజుకు 16 గంటల పని అప్పచెప్పారని, పని చేయడానికి మొండికేయగా, అక్కడున్న చైనీయులు తన పాస్‌పోర్టు గుంజుకున్నారని, చివరకు అక్కడున్న ఆర్మీ వాళ్లకు తాము దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించగా జైలు పాలయ్యానని వాపోయాడు. ఇదే విధమైన మోసంతో సుమారు ఐదు వేల మంది భారతీయులు కాంబోడియాకు వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు. మోసగాళ్లు వీరిచే బలవంతంగా చట్టవ్యతిరేక సైబర్ నేరాలు చేయిస్తూ స్వదేశంలోని భారతీయుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు.
కాంబోడియా వేదికగా జరుగుతున్న ఈ స్కామ్‌లో బాధితులను బలవంతంగా దింపుతున్నారు. తాము కేంద్ర ప్రభుత్వ అధికారులుగా నటించి వారిచే సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మహిళల పేర్లు, నకిలీ ఫోటోలతో తమతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఓపెన్ చేయించి ఈ వ్యవహారాలు నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రోజూ టార్గెట్లు విధించేవారని, అవి నెరవేర్చని వారికి భోజనం కూడా పెట్టేవారు కాదని చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్‌తోపాటు వివిధ డేటింగ్ యాప్‌ల్లో మహిళలవలే తమతో నటింపచేస్తూ భారతీయులను నమ్మిస్తున్నారని, వారి నుంచి క్రిప్టో పెట్టుబడుల పేరిట డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. కాంబోడియాలో ఈ విధంగా దాదాపు 5 వేల మంది భారతీయ నిరుద్యోగులు చిక్కుకున్నారని దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే విధంగా మయన్మార్‌లో సైబర్ క్రైమ్ రాకెట్ సాగుతోంది. బాధితులను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి థాయిలాండ్, ఇతర తూర్పు ఆసియా దేశాలకు ఉద్యోగాల పేరిట పంపుతున్నారు. పర్యాటక వీసాలపై ఏజెంట్లు మయన్మార్ సరిహద్దుల వరకు తీసుకెళ్తున్నారు. అక్కడనుంచి పడవల్లో నదులు దాటించి చివరికి సాయుధ తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో దింపుతున్నారు.
అక్కడనుంచి బాధితులకు తీరని నరకయాతన సాగుతోంది. పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచుతున్నారు. చెప్పినపని చేయకుంటూ అవయవాలను తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఈ విధంగా మయన్మార్ సైబర్ క్రైమ ఇరుక్కున్న 60 మంది భారతీయులను మహారాష్ట్ర పోలీస్ సైబర్ విభాగం రక్షించగలిగింది. ఈ కేసుకు సంబంధించి ఒక విదేశీయుడితో సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఉత్తరాది కేంద్రంగా సైబర్ నేరాలు చేసే సూత్రధారులకు సహాయం చేసే పాత్రధారులు హైదరాబాద్ నగరంలో కూడా ఉంటున్నారు. బోగస్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఇవ్వడం ద్వారా సహకరిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్‌హోమ్ అన్న పేరుతో స్కామ్ నడుస్తుండడం ఇటీవలనే బయటపడింది. ఇందులో ప్రధాన పాత్ర వహించిన నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ద్వారా రోజుకు రూ. 17 వేల నుంచి రూ. 18 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటోందని నమ్మిస్తున్నారు. అంతేకాదు తమ వద్ద కొన్ని స్కీమ్‌లు ఉన్నాయని పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు.