అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో గుజరాత్ (Gujarat) టైటాన్స్ అసాధారణ ఆటతో ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ 18 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలొ కొనసాగుతోంది. కానీ చివరి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూడడం జట్టుకు కలవర పరిచే అంశంగా చెప్పాలి. వరుసగా మూడు మ్యాచుల్లో గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో జరిగిన పోటీల్లో గుజరాత్ బౌలర్లు పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచారు. ఈ మూడు మ్యాచుల్లోనూ టైటాన్స్ బౌలర్లు ప్రత్యర్థి జట్లకు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ప్లేఆఫ్‌కు ముందు బౌలర్ల ప్రదర్శన జట్టును కలవర పరుస్తోంది.
కిందటి మ్యాచ్‌లో చెన్నై ఏకంగా 230 పరుగుల భారీ స్కోరును సాధించింది. అంతకుముందు మ్యాచ్‌లో లక్నో 235 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 199 పరుగులు సాధించి గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. రషీద్ ఖాన్, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్, రబడా వంటి స్టార్ బౌలర్లు ఉన్నా గుజరాత్ ప్రత్యర్థి టీమ్‌లను కట్టడి చేయలేక పోతోంది. ఇది జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న మ్యాచుల్లోనైనా గుజరాత్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.