అమరావతి: టిడిపి పార్టీ ఇంతగా కొనసాగిందంటే పసుపు సైనికులే కారణమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. జనసేన, బిజెపితో పొత్తుపెట్టుకుని ఎన్డీయే ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కడపలో మహానాడు కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ..2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యమని, 93 శాతం సెక్టరేట్ తో అద్భుత విజయం సాధించామని చెప్పారు. పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. టిడిపి పని అయిపోయిందని గతంలో కొందరు మాట్లాడారని, టిడిపి పని అయిపోయిందన్న వాళ్ల పనే అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు.
విధ్వంస పాలనతో ఎపిని గత పాలకులు సర్వనాశనం చేశారని, ప్రశ్నించిన నాయుకులను వెంటాడి ప్రాణాలు తీశారని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు నేలపై అన్ని పార్టీల్లోనూ టిడిపి వర్శిటీ నుంచి వచ్చిన నేతలే ఉన్నారని, కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తామని హామి ఇచ్చారు. ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసిన ఏకైక పార్టీ టిడిపి అని అభివృద్ధి అజెండాగానే పార్టీ ప్రస్థానం సాగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే టిడిపి
ఆవిర్భావానికి ముందు, తర్వాత అనే చూసారని, సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ప్రతిదానికి టిడిపినే ట్రెండ్ సెట్టర్ అని
తెలియజేశారు. టిడిపికి ఒక బ్రాండ్ ఉందని, నీతి, నిజాయితీ రాజకీయాలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.