హైదరాబాద్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా పెంచిన సినిమాల్లో పుష్ప కూడా ఒకటి. అయితే ఆ సినిమాలో ఫహాద్ పాజిల్ పోషించిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు హీరో పాత్రతో సమానంగా గుర్తింపు వచ్చింది. అయితే ఆ పాత్ర కోసం మొదలు తననే సంప్రదించారని నటుడు నారా రోహిత్ (Nara Rohith) చెప్పారు.
నారా రోహిత్ (Nara Rohith) త్వరలో ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ (Pushpa) సినిమాలో తనకు వచ్చిన అవకాశం గురించి వెల్లడించారు. షెకావత్ పాత్ర రోహిత్ చేయాల్సింది కానీ ఎలా మిస్ అయిందో ఆయన చెప్పారు. ‘కొవిడ్ సమయంలో మీసాలతో ఓ ఫోటోను సిద్ధం చేసి నాకు పంపారు. నిర్మాతతో పాటు, సుకుమార్ కూడా ఆ పాత్ర గురించి నాతో చర్చించారు. కానీ, అది పాన్ ఇండియా సినిమా కావడంతో.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్‌ని తీసుకున్నారు’ అని రోహిత్ పేర్కొన్నారు.