ముంబై: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7వ తేదీన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక సైనికుడిని దేశం మొత్తం కొనియాడింది. అయితే ఇప్పుడు బీసీసీఐ కూడా ఈ రియల్ హీరోస్‌కి సత్కరించాలని నిర్ణయించుకుంది. ఐపిఎల్ పైనల్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ విషయాన్ని బిసిసిఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో మన సాయుధ దళాలు ప్రదర్శించిన శౌర్య, పరాక్రమాలు.. వారి నిస్వార్థ సేవలు అందరికి స్పూర్తిదాయకమని బిసిసిఐ (BCCI) కార్యదర్శి సైకియా అన్నారు. అందుకే ఐపిఎల్ ముగింపు వేడుకలను వారికి అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, మిలిటరి టాప్ ర్యాంక్ అధికారులు పలువురు జవాన్లలను ఈ ముగింపు వేడుకలకు ఆహ్వానించాం’ అని సైకియా పేర్కొన్నారు. క్రికెట్ అంటే అందరికి ఇష్టమని, కానీ, మన దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదనిసైకియా వెల్లడించారు.