కర్నాటకలో బిజెపి సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నందుకు ఎస్‌టి సోమశేఖర, ఎ శివకుమార్ హెబ్బార్‌లను ఆరేళ్ల పాటు పార్టీనుంచి బహిష్కరించినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర మంగళవారం విలేఖరులకు చెప్పారు. సుదీర్ఘ చర్చ అనంతరం పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఎలను బహిష్కరిస్తూ ఆ పీర్టీ తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విమర్శించారు.సోమశేఖర యశ్వంత్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, శివకుమార్ యెల్లాపూర్ నియోజకవర్గం ఎంఎల్‌ఎగా ఉన్నారు. 2019లో హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని
కూలదోసి యెడ్యూరప్ప నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కడానికి తోడ్పడిన 18 మంది కాంగ్రెస్, జెడి(ఎస్) ఎంఎల్‌ఎలలో ఈ ఇద్దరు ఉన్నారు.ఈ ఇద్దరూ 2023అసెంబ్లీ ఎన్నికల్లోబిజెపి టికెట్‌పై గెలుపొందారు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగాప్రారంభించారు. ఇద్దరూ పార్టీ ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా పార్టీ సమావేశాలకు హాజరు కావడం కూడా మానేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ ఇద్దరికి చాలా అవకాశం ఇచ్చామని, అయితే వారు పార్టీ హెచ్చరికలను పట్టించుకోలేదని, అందుకే చివరికి వారిని పార్టీనుంచి బహిష్కరించినట్లు విజయేంద్ర చెప్పారు. ఈ ఇద్దరి కార్యకలాపాలపై పార్టీ రాష్ట్ర కోర్ కమిటీలో చర్చించామని, కేంద్ర పార్టీ హైకమాండ్‌కు కూడా వారి గురించి తెలియజేయడం జరిగిందని కూడా ఆయన చెప్పారు.