ఐటిఐ విద్యనభ్యసించే వారికి ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్‌టిసి ఐటిఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌టిసి సంస్థ సూచించింది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టిజిఎస్ ఆర్‌టిసి డిపోల్లో అప్రెంటిషిప్ సౌకర్యం కల్పించన్నుట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో
ఈ నెల 21లోగా https://iti.telangana.in వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటిఐ ఒక మంచి అవకాశమని సంస్థ పేర్కొంది. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటిఐ కళాశాలలను ఆర్‌టిసి ఏర్పాటు చేసింది. ఐటిఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ లోని హకీంపేట, వరంగల్ ములుగు రోడ్‌లోని ఐటిఐ కళాశాలలను నేరుగా సంప్రదించవచ్చన్నారు.