ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు శోభన (Shobana).. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె తిరిగి ‘కల్కి-2898ఎడి’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా తురడుమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధించింది. తాజాగా శోభన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. అందులో భాగంగా కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించడం ఎలా ఉందని ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆమె గతంలో తనకు అమితాబ్‌కి(Amitabh) మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ (Amitabh) అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అంతే వినయంగా, విధేయతలతో ఉన్నారని ఆమె అన్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్‌కి వెళ్లాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై మరొకటి వేసుకొని ఉన్నాను. బచ్చన్ సర్కి కారవాన్ ఉంది. కానీ, చాలా మంది షూటింగ్ చూసేందుకు రావడంతో అంతా గందరగోళంగా మారింది. నేను దుస్తులు మార్చుకొనేందుకు కారవాన్ అడిగాను. అప్పుడు ఒకతను వచ్చి ‘ఈమె మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాదా, ఎక్కడైనా సర్థుకుంటారు.. ఆ చెట్టు వెనక దుస్తులు మార్చుకుంటుందిలే’ అని చులకనగా అన్నారు. ఇది అమితాబ్ సర్ వద్ద ఉన్న వాకీ టాకీలో వినిపించింది. వెంటనే ఆయన నేనున్న చోటకు వచ్చి అలా మాట్లాడిన వ్యక్తిని కోప్పడ్డారు. అంతేకాక.. దుస్తులు మార్చుకొనేందుకు ఆయన కారవాన్ నాకు ఇచ్చారు’’ అని శోభన (Shobana) తెలిపారు.
కల్కి సినిమా సమయంలో కూడా ఆయన చాలా బరువున్న దుస్తులు వేసుకున్నారు. భారీ ప్రొస్తటిక్స్ వాడారు. అయినా కూడా ఎవరైనా వస్తే.. ఆయన లేచి నిలబడి పలకరించేవారు. అని శోభన పేర్కొన్నారు.