పెళ్లి చేసుకుని , భర్త రాజా రఘువంశీని హానీమూన్ పేరిట మేఘాలాయాకు తీసుకువెళ్లి చంపించింది భార్య సోనమే అని వెల్లడైంది. అత్యంత విషాదాంతం , అర్థాంతర జీవితం రఘువంశీకి మిగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘు భార్య హంతకురాలై ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని గజియాపూర్ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు లొంగిపోయింది. తాను ముగ్గురిని కిరాయికి మాట్లాడుకుని భర్తను చంపించిన మాట వాస్తవమేనని అందమైన సోనమ్ పేరున్న ఈ పతీహంతకి తెలిపింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ముగ్గురు కిరాయి దుండగులను అర్థరాత్రి తరువాత సాగించిన దాడులలో పోలీసులు అరెస్టు చేశారు. జరిగిన మొత్తం ఘటన వివరాలను మేఘాలయా డిజిపి నాన్‌గరంగ్ వార్తా సంస్థలకు సోమవారం తెలిపారు.ఇటీవలే పెళ్లయిన తరువాత జంట మధ్యప్రదేశ్‌కు దూరంగా ఉన్న మేఘాలయాలోని అత్యంత మారుమూల, ఏకాంత ప్రాంతం ఈస్ట్ ఖాసీ పర్వతాల్లోని సోహ్రా ప్రాంతానికి వెళ్లారు. ఈ మహిళనే ఆయనను పట్టుపట్టి అక్కడకు తీసుకువెళ్లిందని ఇంటరాగేషన్‌లో వెల్లడైంది.
ప్రస్తుతం యుపి పోలీసు కస్టడీలో ఈ మహిళ ఉంది. ఘాజీపూర్‌లోని నంద్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో సోనమ్ సరెండర్ అయింది. మే 11వ తేదీన పెళ్లయిన తరువాత ఇద్దరూ, 23వ తేదీన ఇద్దరూ జాడ తెలియకుండా పొయ్యారు. తామిద్దరం అదృశ్యం అయినట్లు సోనమ్ అతి తెలివిగా ప్రచారం చేసింది. ఇద్దరు గల్లంతు తరువాత క్రమంలో పోలీసులు , అక్కడి అధికారుల బృందాలు జరిపిన గాలింపుల క్రమంలో భర్త రఘువంశీ శవం అక్కడి కాలువలో దొరికింది. భార్య జాడ తెలియలేదు. అక్కడి ప్రత్యక్ష సాక్షాలు, రఘు కుటుంబీకుల సమాచారంతో ఈ ఘటనలో ఆమె పాత్ర ఉందనే దిశలో పోలీసు దర్యాప్తు సాగింది. ఇప్పుడు ఆమె సరెండర్‌తో ఇదే నిజం అని స్పష్టం అయింది. అరెస్టు అయిన ముగ్గురిలో ఇద్దరిది మధ్యప్రదేశ్ అని, ఒక్కడు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ వాసి అని తేల్చారు. వీరిని పూర్తి స్థాయిలో ఇప్పుడు మూడు రాష్ట్రాల పోలీసు బృందాలు విచారిస్తున్నాయి. సిట్ బృందాలు ఒక్క వ్యక్తిని ఇండోర్ నుంచి , ఇద్దరిని యుపి నుంచి అదుపులోకి తీసుకున్నాయి. భర్తను చంపేందుకు తమను ఆమె కిరాయికి కుదుర్చుకుందని ఈ నిందితులు తెలిపారు.
ఇప్పుడు అరెస్టు అయిన వారిలో ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, రాజ్ సింగ్ కుశ్వాహా ఉన్నారు. వీరు నవయువకులే . ఈ కేసుకు సంబంధించి ఇండోర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తమ కూతురు భర్తను చంపివేయించిందనే వార్తను తాము నమ్మలేకపోతున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. కేసు పక్కదోవపట్టిందని, సిబిఐ దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వాడు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో , ఇష్టం లేకున్నా సోనమ్ రఘువంశీని పెళ్లి చేసుకుందని, పెళ్లి తరువాత ప్రియుడి ప్లాన్ ప్రకారం , మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి చంపివేయించిందని పోలీసు వర్గాలు నిర్థారించాయి.
నేను చంపలేదు..కిడ్నాప్ అయ్యాను..పోలీసులకు తెలిపిన సోనమ్ ?
భర్తను తాను చంపించాననే వాదనను సోనమ్ ఖండించారు. హానీమూన్‌కు వెళ్లిన దశలో కొందరు తనను భర్తను ఎత్తుకెళ్లారని , తరువాత రెండురోజలకు తనను వదిలిపెట్టారని , భర్త ఏమయ్యాడనేది అప్పుడు తనకు తెలియదని, ఈ కేసులో తనకు ఎటువంటి పాత్ర లేదని తెలిపారు. ఘాజీపూర్ ప్రాంతంలో కిడ్నాపర్లు తనను వదిలేసి వెళ్లారని, అక్కడి హోటల్ నుంచే తాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. అయితే ఆమెకు పెళ్లి కాకముందు రాజ్ అనే ఓ వ్యక్తితో సంబంధం ఉందని, ఈ వ్యక్తికూడా ఈ హత్యోదంతంలో పాలుపంచుకున్నాడని పోలీసు దర్యాప్తు క్రమంలో ఇప్పుడు సూచనప్రాయంగా వెల్లడైంది.