Tuesday, July 1, 2025

మంటలు రేపుతున్న ఇథనాల్ కంపెనీలు

- Advertisement -
- Advertisement -

కరువు సీమ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇథనాల్ మంటలు చెలరేగుతున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతుల గుండెల్లో ఈ ఇథనాల్ కంపెనీలు అలజడులు రేపుతున్నాయి. పచ్చని పంట పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఇథనాల్ కంపెనీలు మాకొద్దంటూ గ్రామాల రైతులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ఈ ఇథనాలు కంపెనీలను ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయని మేధావులు నిలదీస్తున్నారు. బలవంతంగా, దౌర్జన్యంగా గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించే విధంగా ఇథనాల్ కంపెనీలు పాలమూరు జిల్లాలో చిచ్చురేపుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు లక్షల మంది రైతులకు జీవనాధారం, లక్షల ఎకరాలకు, లక్షల మంది ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే జీవనదులు.

ఇలాంటి జీవనదులున్న ప్రాంతంలో ఈ ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు జరిగితే కాలుష్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని, తద్వారా మానవాళి, జంతు జీవుల ప్రాణాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇథనాల్ కంపెనీల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నాయి. అదే సందర్భంలో గ్రామాల్లో రైతులు (Farmers villages)ఇథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడుతున్నారు. ఆ రైతులపై కేసులు నమోదు అవుతున్నా ముందుకే కదులుతున్నారు. అన్నం పెట్టే రైతులపై కేసులు నమోదు చేయడంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం గమనార్హం. ఎన్నికలకు ముందు అప్పట్లో ఇథనాల్ కంపెనీలను పాలమూరులో ఎత్తివేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి నేతగా ఉన్న సమయంలో డిమాండ్ చేశారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో అయిజ మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దన్నా రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లా చిత్తనూర్ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు సమయంలో మాకు వద్దని ఆందోళన చేసిన రైతులపై అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి రైతులపై లాఠీలతో కొట్టించి కేసులు నమోదు చేసింది. ఇప్పుడు బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఇరు పార్టీల ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? అసలు ఇథనాల్ కంపెనీ అంటే ఏమిటి? దానిని ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇస్తోంది? ఈ కంపెనీల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీని వలన నిజంగా గ్రామాలకు, రైతులకు మేలు చేస్తుందా? మేలే జరిగితే రైతులు దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు వంటి సవా లక్ష ప్రశ్నలు బేరీజు వేసుకుంటే అసలు ఇథనాలు కంపెనీల వెనుక ఉన్న బడా నేతల వ్యూహాలు, అసలు దోపిడీ కథలు వెలుగులోకి రానున్నాయి.

అసలు ఇథనాల్ అంటే ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్యం, రైతులకు ఆర్థిక చేయూత, క్రూడ్ దిగుమతుల భారం తగ్గించుకోవడం వంటి అంశాల ఆధారంగా ఒకే పరిష్కార మార్గంగా కనుగొనబడిందే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. దీనిని కేంద్ర ప్రభుత్వం 2003లో ప్రారంభించింది. ముఖ్యంగా వాహనాలకు వాడే పెట్రోల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ఇథనాల్ ప్రత్యామ్నాయ ఇంధన రసాయనాన్ని ప్రోత్సహించింది. చెరకు, మొక్కజొన్న, బియ్యం, గోధుములు వంటి వాటి ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వనరులు పెరిగి వరి పెద్ద ఎత్తున సాగు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇథనాల్ కంపెనీలకు కేంద్రం అందించే సబ్సీడితోపాటు ఇతర సదుపాయాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బడా రాజకీయ పార్టీలు (అన్ని పార్టీల నేతలు) ఈ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.

బడా వ్యాపారవేత్తలతోపాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు సభ్యులుగా ఉంటూవచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేయాలన్నది లక్షంగా ముందుకు వచ్చారు. అందులో భాగంగానే పేద జిల్లా, కరువు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాను అనువైన జిల్లాగా మలుచుకున్నారు. వలస జిల్లాగా ఉన్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి అయి పుష్కలంగా సాగునీరు వచ్చి రెండు పంటలు వేసుకొని హాయిగా జీవిస్తున్నారు. వలసలు వెళ్లకుండా ఇక్కడే పిల్లా పాపలతో జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు తిరిగి వారి గుండెల్లో ఇథనాల్ కంపెనీలు గునపాలు గుచ్చుతున్నాయి. దీంతో వారు తిరిగి ఆందోళనబాట పట్టారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో పూర్తిగా వెనుకబడిన జిల్లాగా ఉన్న నారాయణపేట జిల్లాలో మరికల్ మండలం చిత్తనూర్ గ్రామంలో జూరాల ఆర్గానిక్ పేరుతో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేశారు.

చిత్తనూర్, ఎక్లాస్‌పూర్, జిన్నారంతోపాటు మరో ఐదు గ్రామాల పరిధిలో వందల ఎకరాలు పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండేది. ఇక్కడ కోయల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందడంతో సాగునీటి వనరులు పెరిగి పంటలు పండించుకునేవారు. ముందుగా ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడం లేదని చెప్పి లోలోపల నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకున్నారు. ఏకంగా 408 ఎకరాలను రైతుల వద్ద నుంచి చవక ధరకు కొనుగోలు చేసి 32 ఎకరాల్లో ప్యాక్టరీ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో ఒక్కడ మద్యం ఫ్యాక్టరీ, మరో మందుల ఫ్యాకర్టీ ఏర్పాటు చేయాలన్నది వారి లక్షం. అయితే వీటి ఏర్పాటుకు చట్టప్రకారం పర్యావరణ అనుమతులు పొందాలి.

తిరిగి గత కొంత కాలంగా అయిజ మండలం పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై రైతులు తిరగబడడంపై మరో మారు ఇథనాల్ కంపెనీలపై చర్చ జరుగుతోంది. ఇక్కడ కూడా ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా పచ్చని పంట పొలాలు, గ్రామాల మధ్యన ఈ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వెనుక బడా బాబుల ధనార్జనే లక్షం కనిపిస్తోంది. కాలుష్యంతో తమ గ్రామాలు నాశనం అవుతాయని భావించిన ఇక్కడి రైతులు తిరగబడ్డారు. కంటైనర్‌ను తోసేసి, ఒక వాహనాన్ని తగుల బెట్టారు. ఇక్కడ ఇథనాల్ కంపెనీ వద్దే వద్దని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

  • బిజి రామాంజనేయులు,
    (ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో ఇన్‌చార్జీ)
    (90598 95411)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News