Wednesday, June 18, 2025

హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు నేరుగా విమాన సేవలు

- Advertisement -
- Advertisement -

దేశీయ అంతర్జాతీయ విమాన సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ జిఎంఆర్ విమానాశ్రయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. జిఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆఫ్రికాకు నేరుగా విమాన సేవలు మంగళవారం ప్రారంభించారు.- ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాలోని బోల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మంగళవారం నేరుగా ఈ సర్వీసు ప్రారంభమయింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిహెచ్‌ఐఎఎల్ సీనియర్ అధికారులతో పాటు, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఐఎఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ ప్రదీప్ పనిక్కర్ మాట్లాడుతూ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి అడ్డిస్ అబాబాకు నాన్-స్టాప్ సేవలు ప్రారంభించడంతో గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడిందన్నారు.

జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ( జిహెచ్‌ఐఎఎల్) హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఆఫ్రికా ఖండానికి నేరుగా విమాన సేవలు ప్రారంభించడంతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ సేవలను ఆఫ్రికాలో అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన విమానయాన సంస్థ అయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఇది హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాల కేంద్రంగా మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశం, ఆఫ్రికా ఖండం మధ్య కీలకమైన ఆకాశ మార్గంగా ఈ నూతన రూట్ వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు.- ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబా ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార, సాంస్కృతిక, చరిత్రపరమైన కేంద్రంగా గుర్తింపు పొందుతోందని,

నేరుగా విమాన సౌకర్యంతో వ్యాపార, విహార, వైద్య, పర్యాటక ప్రయాణికులకు మరింత అనుకూలత లభించనుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్-ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు మార్గదర్శకంగా నిలవనుందని ఆయన అకాంక్షించారు. భారతదేశం వైద్య పర్యాటనలో గ్లోబల్ హబ్‌గా నిలుస్తోందని, ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, ఉగాండా, రువాండా, జాంబియా, కేమరూన్, కెన్యా దేశాల నుంచి అనేక మంది రోగులు అత్యాధునిక వైద్యం కోసం భారతదేశానికి వస్తున్నారని ఆయన చెప్పారు. కార్డియాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్స్, ఫెర్టిలిటీ తదితర రంగాలలో ఉన్న నిపుణుల సేవలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్సలు, ఆంగ్ల భాష మాట్లాడే వైద్య బృందాలు భారత వైద్య రంగాన్ని విశ్వసనీయంగా మారుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పర్యాటకుల కొరకు, ఇథియోపియా లోని విశేషమైన వారసత్వం, ప్రకృతి వైభవం, సంస్కృతిని అన్వేషించేందుకు అద్భుతమైన అవకాశంమని, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల సేవలను హైదరాబాద్‌కు స్వాగతించడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు.

అడ్డిస్ అబాబా విమానాశ్రయం హైదరాబాద్ నుంచి ప్రపంచంలోని 125కు పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటి కల్పిస్తోందని, ఇది మార్గమధ్య కేంద్రంగా, కార్గో గేట్‌వే గా కీలకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, అంతర్జాతీయ విమాన రూట్లను విస్తరించేందుకు జిహెచ్‌ఐఎల్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సమగ్రంగా నిర్మితమైన రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్ మధ్య ప్రధాన హబ్‌గా పురోగమిస్తోందని, గ్లోబల్ ప్రయాణికుల కొరకు ప్రాధాన్యత గల గమ్యస్థానంగా నిలపడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

విమాన సర్వీసుల వివరాలు
ఇటి682 నెంబరు విమానం అడ్డిస్ అబాబా నుంచి హైదరాబాద్‌కు 16.30 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) బయలు దేరి తరువాత రోజు 01.00 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) హైదరాబాద్‌కు చేరుకుంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇటి683 విమాన ప్రతి మంగళ, గురు, శని వారాల్లో హైదరాబాద్‌లో 02.00 గంటలకు బయలు దేరి అడ్డిస్ అబాబాకు తరువాత రోజు 05.00 గంటలకు చేరుకుంటుంది. వారంలో మూడు సార్లు ఈ విమాన సర్వీసు సుమారు ప్రయాణికులకు అందుబాటులో ఉందనుందని విమానశ్రయ అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News