Thursday, June 19, 2025

కుటుంబమంతా పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు అడుగులు

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల..నేడు శోకసంద్రంలో మునిగింది. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్… ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. గాజర్ల రవి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నాడు. శాంతి చర్చల ఎజెండా తయారుచేయడంలో కీలక పాత్ర పోషించాడు. గాజర్ల రవిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

కుటుంబమంతా ఉద్యమంతోనే…
పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరూ అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్రవేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మిగతా ముగ్గురు పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశాడు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆయన ప్రయత్నించాడు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అజ్ఞాతంలోనే ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్. నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు. ఎఒబి, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలపై ఆయనకు గట్టి పట్టు ఉన్నది. ఎన్నో దాడుల్లో కీలకంగా వ్యవహరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News