Sunday, August 17, 2025

సిరిసిల్ల అడ్డాగా ఫోన్ ట్యాపింగ్

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ..అనేకమంది జీవితాలను మాజీ సిఎం కెసిఆర్ నాశనం చేశారని ఆరోపించారు. అనుమానం పుట్టినంకే కెసిఆర్ పుట్టారని, అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. ట్యాపింగ్ వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్‌రావు అని మండిపడ్డారు. తనతోసహా ఎంతోమంది తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు ఆరోపించారు.

సిఎం ఆఫీస్‌ను అడ్డాగా చేసుకుని తాము ఫోన్లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అని అన్నారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం రాచమర్యాదలు ఇవ్వడం మానుకోవాలన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని తాను 100సార్లు చెప్పానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌తోపాటు పలువురు జడ్జిలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తే సిబిఐ విచారణ కోరాలన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోని ‘పెద్ద మనిషి’ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చినా కెసిఆర్‌కు ఎందుకు నోటీసులివ్వలేదని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కెసిఆర్, కెటిఆర్‌కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య మధ్యనున్న రహస్య ఒప్పందమేమిటి? అని ప్రశ్నించారు. గతంలో టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి తన ఇంట్లోకి పోలీసులు వచ్చారని, అప్పుడు తాను నైట్ డ్రస్‌తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్లో మాట్లాడుతుంటే స్వయంగా తానే విన్నానని అన్నారు. కెసిఆర్ పాలనలో మీడియా సహా అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. జర్నలిస్టులు సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారన్నారు. వాట్సాప్ కాల్‌ను కూడా ట్యాపింగ్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అన్నారు. కెసిఆర్, కెటిఆర్‌లను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పం దం కుదిరిందని, అందుకే కెసిఆర్, కెటిఆర్‌లకు నోటీసులివ్వడం లేదన్నారు.

ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ముందే కెటిఆర్ యుఎస్ వెళ్లింది నిజం కాదా? అన్నా రు. కెటిఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియా వచ్చి సరెండర్ అయ్యారని అన్నారు. బిఆర్‌ఎస్‌ను గద్దె దించింది బిజెపియేనని అన్నారు. కెసిఆర్ మెడలు వంచేలా పో రాటాలు చేసిందే తామేనని, బిఆర్‌ఎస్‌తో తమ పార్టీకి అండర్‌స్టాండింగ్ ఉంటే ఎందుకు పోరాటాలు చేస్తామని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణకు తాము సిద్ధమేనని అన్నారు. అయితే, కేంద్రం నేరుగా సిబిఐ విచారణ జరిపే అవకాశం లేదు కాబట్టే ఆగుతున్నామని, లేకుంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసేవాళ్లమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News