రానున్న మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి తీరుతామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా, నకిరేకల్ మినీ స్టేడియంలో స్థానిక ఎంఎల్‌ఎ వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసిన 3,500 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ నాయకులు రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని, ఇది దేనికి సంకేతమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి శాంతిభద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని అన్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదోడి ఇంటికలను నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి సహచర మంత్రులు అందరం కలిసి ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పదేల్ల కాలంలో 93 వేలు ఇల్లు మొదలుపెట్టి 66 వేలు పూర్తి చేసి 30 వేలు మొండిగోడలు మిగిల్చిందన్నారు. ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రకటనలు, పబ్లిసిటీ తప్ప చేసింది శూన్యమని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద వాడి ఇంటి కలను నెరవేర్చి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. 8 లక్షల 19 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పారు. దానికి నెలకు రూ.6,500 కోట్లు అసలు, వడ్డీ కలిపి తాము బ్యాంకులకు చెల్లిస్తున్నామని తెలిపారు.. అప్పు ఉన్న మాట వాస్తవం. అప్పు పుట్టని మాట వాస్తవం..
అయినా ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 8 లక్షల 60 వేల దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 నాటికి వీటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి రైతులకు స్వాతంత్య్రాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. నకిరేకల్ శాసనసభ్యుడు కోరిన విధంగా వారం రోజుల్లో రామన్నపేట, నకిరేకల్ తహసిల్దార్ కార్యాలయాలకు భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిబంధనలు సడలించాలని కోరారు. సన్న బియ్యం, రైతు భరోసా, బీమా అన్నింటి పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నదని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావోకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. భూమి ఉన్న ప్రతి వ్యక్తికి భూ భారతి చట్టం ఒక వరం అన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారుచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, శాసనమండలి మాజీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమీత్, ఆర్‌డిఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జెడ్‌పి సిఒఒ శ్రీనివాసరావు, బిసి కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూజార్ల శంబయ్య, నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, వ్యవసాయ కమిటీ మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.