కాలాల గతానుగతిక సంచారంలో
లోకపు వాకిలిలో పూసి రాలిపోయే
రేల పూల రాగాన్ని నేను
అనంత నక్షత్ర రాశిలోంచి
వెలుగులు విరజిమ్మి నేలను ఒరిగిపోయే
లెక్కకు మించిన సమూహంలోని
ఒకానొక చుక్కను నేను
పుడమిన నిత్యం పురుడు పోసుకుంటున్న
కోటానుకోట్ల జీవరాసుల్లో
రాశి పోసిన సద్గుణ దుర్గుణ
సమాహారాల వికల శకలాన్ని నేను
విరుద్ధ భావాల దగ్ధ జ్వాలను నేను
అక్షరం జ్ఞాన చక్షువై దారి చూపిన చేతనలో
సత్యా సత్యాల సమీకరణాల వెదుకులాట
పారే నదినై తేట పరచుకున్న బతుకు బాట
బాల్యం..
నిట్టాడు విరిగిన నిశీధి గుడిసెలో
నిప్పుల గుండాలలో పొర్లిన
నిత్తె తండ్లాటల నుమాయిష్
కౌమారం..
కక్షల సర్పాల బుస బుసల మధ్య
ఊపిరి దీపాన్ని ఆరిపోనీయని
ఆరాట పోరాటాల అలజడి
యవ్వనం..
అలలు ఉప్పొంగే అంతరంగ సంద్రంలో
కొత్త కలల కల్లోల కెరటాల ఆటుపోటులు
కన్నీటి జలపాతాలకు అడ్డుకట్ట వేయాలని
గోగుపూల దారిలో తడబడిన అడుగులు
ఆఖరి అంకం..
కన్ఫెషన్ బాక్స్ ముందు
మోహావేశాల ముసుగు తీసి మోకరిల్లిన మేను
సామూహిక చలనాల చేలాంచల హోరు
మనిషిగా నిలబడేందుకు
మరల మరల చేసుకుంటున్న
మనో లిట్మస్ టెస్ట్
అక్షరానికీ, ఆత్మకు చెదలంటకుండా
ఆఖరి శ్వాస దాకా కాలం కొలిమిలో
నన్ను నేను పుటం పెట్టుకోవడమే
నా పుట్టుక పరమార్థాన్ని పదిలపరచే
చరమాంకపు చరితార్థ సారం
గాజోజు నాగభూషణం