Friday, July 11, 2025

కదిలిన జగన్నాథ రథచక్రాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర శుక్రవారం లక్షలాది భక్తుల జైజగన్నాథ్ నామస్మరణతో ప్రారంభమైంది. 12 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రవేడుకలో శుక్రవారం మొదటి రోజే దాదాపు 10 లక్షల మంది పూరీ క్షేత్రానికి చేరుకున్నారని అధికార వర్గాలు అంచనా వేశాయి. 12 వ శతాబ్దం నాటి ఈ క్షేత్రంలో గుడించ ఆలయం వైపు 2.6 కిమీ పొడవునా రథాలని వేలాది మంది భక్తులు తాళ్లతో లాగుతూ ముందుకు కదిలారు. ఇదే రథయాత్రలో ప్రధాన ఘట్టం.ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి , ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఇతర ప్రముఖులు జగన్నాథ, దేవీ సుభద్ర, బలభద్ర రథాలను లాగుతూ ముందుకు కదిలారు. భక్తులు బాకాలు, శంఖాలు ఊదుతూ, తాళాలు కొడుతూ జై జగన్నాథ్ , హరి బోల్ నినాదాల హోరెత్తించగా రథాలు ముందుకు కదిలాయి. సాయంత్రం 4.08 గంటలకు బలభద్ర దేవుని తలడ్వాజా రథం యాత్ర మొదట ప్రారంభమైంది.

ఆ తరువాత దేవీ సుభద్ర దర్పదలన్ రథం, చివరకు జగన్నాథ్ నందిఘోష్ రథం ముందుకు సాగాయి. భక్తులు రథాలు లాగుతుండగా, దేవతా మూర్తుల వద్ద పూజార్లు పూజలు చేయడం కనిపించింది. గ్రాండ్ రోడ్డు మీదుగా ఈ ఊరేగింపు సాగింది. . పూరీ రాజుగా వంశపారంపర్య కీర్తి పొందిన గజపతి మహరాజా దివ్యసంఘదేవ్ మూడు రథాలను పహన్రా అనే సంప్రదాయంతో రథాలను తుడిచారు. భక్తులు రథాలను లాగే ముందు వాటికి రంగురంగుల కొయ్య గుర్రాలను అమర్చారు. అంతకు ముందు పూరీ రాజు బలభద్ర, దేవీ సుభద్ర, భగవాన్ జగన్నాథ్ మూర్తులకు రెండున్నర గంటల సేపు పహండీ సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్టులైన మూడు కొయ్య విగ్రహాలను జగన్నాథ ఆలయం నుంచి తరలించి రథాల వద్దకు తీసుకు వచ్చారు. ఒడిశా నృత్యకళాకారిణులు, జానపద కళాకారులు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు దేవతా మూర్తుల ముందు ప్రదర్శనలు చేశారు. గోవర్థన్ పీఠం శంకరాచార్య , స్వామీ నిశ్చలానంద సరస్వతి, శిష్య బృందాలతో దేవతా మూర్తుల రథాలను సందర్శించి పూజలు చేశారు. 81 ఏళ్ల వయోవృద్ధులు ,శంకరాచార్య వీల్‌చైర్‌లో వచ్చి రథాయాత్ర వేడుకల్లో పాల్గొనడం విశేషం.

కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షెకావత్, పూరీ ఎంపి సంబిత్ పాత్ర, ఒడిశా రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పహండీ పూజల్లో పాల్గొన్నారు. ఈ యాత్రకు 10 వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ సోలీసులు, ఎన్‌ఎస్‌జి తదితర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. రథాయాత్ర సజావుగా సాగేందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేశామని, జనం రద్దీని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి వీలుగా ఏఐ సాంకేతికతతో 275 సిసిటివి కెమెరాలను అమర్చామని డిజిపి వైబి ఖురానియా పాత్రికేయులకు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎడిజిపి (లా అండ్ ఆర్డర్ ) సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జి స్నిపర్స్, కోస్తా రక్షణ డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు , కెనైన్ టీమ్స్, తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయం కూడా ఒడిశా పోలీస్‌తో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News