మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) కన్నప్ప సినిమాను, అందులో విష్ణు నటనను తెగ మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత తన స్పందనను విష్ణుకు ఆయన మెసేజ్ చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను విష్ణు ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
‘‘నాకు ముందునుంచే దేవుడు, భక్తి అనే విషయంపై నమ్మకం లేదు. అందుకే నేను భక్తి చిత్రాలు చూడను. కాలేజీలో ఉన్న సమయంలో భక్త కన్నప్ప చిత్రం నాలుగు సార్లు చూశాను. అది కూడా హీరో, హీరోయిన్, పాటల కోసమే. కానీ, ఈ సినిమా (Kannappa) విషయానికొస్తే.. నువ్వు నటించావు అనడం కంటే.. తిన్నడు పాత్రలో ఆలయమంత భక్తితో ఉన్న వ్యక్తిలా జీవించేశావు. కొన్ని సన్నివేశాల్లో నాకు ఊపిరి ఆడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శివలింగం నుంచి రక్తం కారుతుంటే దాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సన్నివేశంలో నీ నటన అత్యద్భుతం. నేనొక నాస్తికుడిని.. నాకు ఇలాంటి సన్నివేశాలు నచ్చవు. కానీ, నాలాంటి వాడిని కూడా ఇష్టపడేలా చేశావు. శివ భక్తుడిగా మారపోవడంలో నువ్వు చూపించిన నిబద్ధత మాస్టర్ క్లాస్. ఆ సమయంలో నీ ముఖంలోని హవభావాలు, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు చేతులెత్తి నమస్కారం పెట్టే కళాఖండాలు. అందరూ సినిమాకి ప్రభాస్ కోసం వస్తున్నారు. కానీ, నేను మాత్రం నీ కోసమే మళ్లీ టికెట్ కొని సినిమాకు వెళ్తా’’ అని ఆర్జివి (RGV) విష్ణుకు మేసేజ్ చేశారు.
దీనిపై విష్ణు స్పందిస్తూ.. ‘‘రాము గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజుల నుంచి కన్నీళ్లు ఆపుకుంటున్నా. ఎందుకంటే ఇది సాధించాలనే నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా ప్రయాణం నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడుకున్నది. నేను ఎక్కడికి వెళ్లినా కనిపించే ప్రతి వారిలో సినిమాపై ద్వేషం, అవమానాన్నే చూశాను’’ అంటూ రిప్లై ఇచ్చారు.