Monday, June 30, 2025

టీ20ల్లో డు ప్లెసిస్ అరుదైన రికార్డు.. రోహిత్, బట్లర్ సరసన చోటు

- Advertisement -
- Advertisement -

డల్లాస్: టీ20ల్లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) అరుదైన రికార్డు సాధించాడు. మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్ సి)లో భాగంగా నిన్న డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు, MI న్యూయార్క్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు దిగగా, ఆ జట్టు ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. డు ప్లెసిస్ 53 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. డు ప్లెసిస్ శతకంతో మెరవడంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 223 పరుగులు భారీ స్కోరు చేసింది.

కాగా, ఈ సెంచరీ.. T20ల్లో డు ప్లెసిస్ కు 8వది. దీంతో T20 క్రికెట్ లో నాల్గవ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ సరసన ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచాడు. వీరందరూ టీ20ల్లో 8 సెంచరీలు చేశారు. ఇక, యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అత్యధికంగా 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత బాబర్ అజామ్ (11) రెండవ స్థానంలో.. రిలీ రుస్సో 9, విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మూడవ స్థానంలో ఉన్నారు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ కింగ్స్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీరన్ పొలార్డ్ (70), ఓపెనర్ డి కాక్ (35) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. చెన్నై బౌలర్లో అకీల్ హొస్సేన్ మూడు వికెట్లు, నాండ్రే బెర్గర్, మార్కస్ స్టోయినిస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News