Wednesday, July 2, 2025

కాళేశ్వరం… కూలేశ్వరంగా మారింది: సీతక్క

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఇంఛార్జీ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. మంగళవారం నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. 2014 తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నిధులు, నియామకాలు అని చెప్పి నిధులన్నింటిని కెసిఆర్ కుటుంబసభ్యులు నీళ్లన్నీ ఫాంహౌస్ లోకి తరలించారని ఆరోపించారు. వరి వేస్తే రైతులకు ఉరి పడ్డట్టేనని అన్నారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు రూ 500 బోనస్ ఇస్తుందని ప్రశంసించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తుందని, అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇళ్లకు కరెంట్ ఇస్తోందని కొనియాడారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం పదేళ్లలో కేవలం 60 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని, అందులో సగానికి పైగా బిల్లులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతికార్యకర్త కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టీ పార్టీ కోసం పనిచేయాలని తెలిపారు. గ్రూపు రాజకీయాలతో పార్టీ స్థాయి తగ్గిపోతుందని కార్యకర్తలు, నాయకులను హెచ్చరించారు.

ఈ నెల 4వ తేదీన ఎఐసిసి అధ్యక్షుడు రాక..

ఈ నెల 4 వ తేదిన ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నూతన పిసిసి నియామకం తర్వాత మొదటి సారిగా రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. అందుకు ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపు ఇచ్చారు. ఆ రోజు ప్రతి కాంగ్రెస్ నాయకులకు, పార్టీ దిశ నిర్దేశం చేస్తారని తెలిపారు. అందుకే ప్రతి నియోజక వర్గ ఇంఛార్జీలు తమ పరిధి గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లు సురేశ్ షెట్కార్, సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, భూపతిరెడ్డి, ఈరవత్రి అనిల్, మదన్ మోహన్, లక్ష్మీ కాంతారావు, సంజయ్, బల్మూరి వెంకట్, వీరం బొజ్జ, బండి రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News